calender_icon.png 19 January, 2026 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్ ఇండియా లక్ష్యంగా ఆరోగ్య భారత్

19-01-2026 12:48:35 AM

జీవనశైలిలో మార్పుతో పెరుగుతున్న ఒబెసిటీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరిక

శేరిలింగంపల్లి జనవరి 18 (విజయక్రాంతి): ప్రస్తుత కాలంలో ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో ఒబెసిటీతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ 57వ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని మాట్లాడారు.

చిన్నప్పటి రోజుల్లో రోజువారీ పనులన్నీ మనమే చేసుకునే పరిస్థితి ఉండేదని, నేటి సాంకేతిక యుగంలో శ్రమ తగ్గిపోవడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ముఖ్యం గా నూనె వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ప్రజలకు పిలుపునిస్తున్నారని గుర్తు చేశారు. ఆరోగ్యమే దేశ బలం అని పేర్కొంటూ, ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా ఆరోగ్య భారత్ నిర్మాణమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, శక్తివంతమైన యువతే దేశానికి నిజమైన సంపద అని అన్నారు. క్రమమైన వ్యాయా మం, సైక్లింగ్ వంటి అలవాట్లు జీవనశైలిలో భాగమైతేనే ఒబెసిటీ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చని, అప్పుడే ఆరోగ్యవంతమైన భారత నిర్మాణానికి బాట పడుతుందని పేర్కొన్నారు.