భారతదేశంలో రూ.300 కోట్లతో భారీ వెల్‌నెస్ నెట్‌వర్క్
ఈబీజీ గ్రూప్, యూనివర్సల్ ఫిట్నెస్ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం
సికింద్రాబాద్, జూన్11 (విజయక్రాంతి): భారతదేశంలో సరికొత్త హెల్త్, ఫిట్నెస్ అండ్ రికవరీ సంస్కృతిని పరిచయం చేస్తూ ఈబీజీ గ్రూప్, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సల్ ఫిట్నెస్ గ్రూప్తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఏకీకృత వెల్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ను నిర్మించడం కోసం రాబోయే ఐదేళ్లలో రూ,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ భాగస్వామ్యం ద్వారా దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రీమియం హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్లను, రెండు భారీ డెస్టినేషన్ వెల్నెస్ రిట్రీట్స్ను స్థాపించనున్నారు. మొదటి విడతగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వీటిని ప్రారంభించి, ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, పూణే వంటి ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. డెలాయిట్ ఇండియా, హెల్త్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో రూ,16,200 కోట్లుగా ఉన్న ఫిట్నెస్ మార్కెట్ 2030 నాటికి రూ,37,700 కోట్లకు చేరుకోనుంది.
సభ్యుల సంఖ్య కూడా 12.3 మిలియన్ల నుండి 23.3 మిలియన్లకు పెరగనుంది. ఈ భారీ అవకాశాన్ని అందుకోవడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి.సాధారణ జిమ్లకు భిన్నంగా, ఇక్కడ నిర్మించే ప్రతి సెంటర్ 40,000 నుండి 45,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఉంటుంది. ఒకే లొకేషన్లో లేదా ఒకే మెంబర్షిప్తో ఫిట్నెస్, రికవరీ, నివారణ ఆరోగ్యం వంటి సేవలను అందించనున్నారు. ఇందులో అధునాతన ఫిట్నెస్ ట్రైనింగ్, పైలేట్స్, స్విమ్ స్కూల్స్, ఫిజియోథెరపీ, స్పోరట్స్ రీహాబిలిటేషన్, ఏఐ ఆధారిత బాడీ అనాలిసిస్ జోన్లు ఉంటాయి.
అంతేకాకుండా, మెగ్నీషియం మినరల్ పూల్స్, ఇన్ఫ్రారెడ్ సాల్ట్ రూమ్స్, కోల్ ప్లంజ్ థెరపీ వంటి అత్యాధునిక రికవరీ వసతులు ఉంటాయి. అనుమతుల మేరకు కొన్ని సెంటర్లు 24 గంటలూ పని చేయనున్నాయి. ఈ సందర్భంగా ఈబీజీ గ్రూప్ వ్యవస్థాపకులు డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ... భారతదేశంలో వినియోగదారులు ఇప్పుడు కేవలం జిమ్ సాధనాలకు పరిమితం కాకుండా పనితీరు, రికవరీ, దీర్ఘకాలిక శ్రేయస్సును అందించే ఒక పూర్తి ఎకోసిస్టమ్ను కోరుకుంటున్నారన్నారు.
రాబోయే దశాబ్దంలో వెల్నెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక వృద్ధి రంగంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. ప్రతి సెంటర్లో ఫిట్నెస్ కోచింగ్, స్పోరట్స్ సైన్స్,ఫిజియో థెరపీ,హాస్పిటాలిటీ, టెక్నాలజీ సపోర్ట్ వంటి విభాగాల్లో 50 నుండి 60 మంది ప్రొఫెషనల్స్ చొప్పున ఉద్యోగ అవకాశాలు పొందుతారని తెలిపారు.అనంతరం యూనివర్సల్ ఫిట్నెస్ గ్రూప్ ఆస్ట్రేలియా వ్యవస్థాపకులు రామచంద్ర,కో-ఫౌండర్ అంథోనీ కెర్క్మెజ్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఏకీకృత వెల్నెస్ రంగానికి సంబంధించి సరికొత్త అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.






