12 June, 2026 | 1:23 AM

గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లాలో చోరీని 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

12-06-2026 12:00 AM

మూడు రాష్ట్రాల్లో గాలింపు ముగ్గురు అరెస్టు, పూర్తి సొత్తు రికవరీ

శేరిలింగంపల్లి, జూన్ 11 (విజయక్రాంతి): గచ్చిబౌలి హిల్రిడ్జ్ విల్లాలో జరిగిన లక్షల విలువైన బంగారు వెండి చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.మూడు రాష్ట్రాల్లో గాలించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి,పూర్తి సొత్తు రికవరీ చేశారు.ఈ నెల 6న కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీ జరిగింది. పనిమనుషులుగా చేరి ఇంటి సమాచారం సేకరించి, లాకర్ తాళం ఉపయోగించి 7.837 కిలోల బంగారం, 1.361 కిలోల వెండి, రూ.33,170 నగదు, రెండు మొబైల్ ఫోన్లు దోచుకెళ్లారు.

అనంతరం లాకర్ మళ్లీ మూసి వెళ్లి అనుమానం రాకుండా చేశారు.సీపీ డా.ఎం. రమేష్ గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో నిందితులను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్ అలియాస్ సూరజ్ పరారీలో ఉన్నాడు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, ఏసీపీ కళింగరావు, గచ్చిబౌలి ఎస్హెచ్‌ఓ బలరాజు దర్యాప్తు నిర్వహించారు.