బీసీల రక్షణకు చట్టం తేవాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య
కుమ్మెర ఘటన అసెంబ్లీలో లేవనెత్తాలి
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): కుమ్మెర గట్టు ఘటనలో అత్యంత పాశవికంగా బీసీ కుటుంబంపై దాడిచేసిన రెడ్లు మనుషులు కాదు మానవ మృగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన నిరసన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు కొనసాగుతున్నాయని, ఈ దాడులన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతోనే ఆధిపత్య కులాలు రెచ్చిపోతున్నాయన్నారు. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే ప్రత్యేక ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
బీసీల రక్షణ కొరకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికార అండతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, ఇతర నేతలు దళిత బహుజనులపై చేసిన దాడిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ డిమాండ్ చేశారు. కుమ్మెర ఆలయాన్ని వెంటనే తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని కోరారు.
బాధితులకు న్యాయం చేయడం అంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కాదని నిందితులపై హత్యా నేరం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించినప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. ఆయనవెంట రాష్ట్ర కోఆర్డినేటర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ, రాష్ట్ర నాయకులు దాగిళ్ళ దయానంద్ రావ్, నాయకులు అంతటి నాగన్న, ఘనపురం కృష్ణ, యోసేపు, బోనాసి రాంచందర్, శివప్రసాద్, పృథ్వీరాజ్, కళ్యాణ్, రామకృష్ణ, రాము, మధు తదితరులు పాల్గొన్నారు.




