21 May, 2026 | 2:42 AM

ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న జీవనశైలి

20-05-2026 12:00 AM

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. అయితే, ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి అన్ని వయసు ప్రజల ఆరోగ్యంపై చూపుతున్నది. పాత తరం జీవనశైలిలో భౌతిక శ్రమ ఎక్కువగా ఉండేది. కానీ, ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తక్కువైంది. దీని ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో అకాల మరణాలకు చాలా వరకు జీవనశైలి కారణంగా సంక్రమించే వ్యాధులే కారణమవుతున్నాయి.

ఆధునికత పేరు చెప్పి మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. జీవనశైలి వ్యాధుల్లో ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటివి అధికంగా ఉన్నాయి. ఫాస్ట్‌ఫుడ్ తినడం, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవనం ఇవన్నీ జీవనశైలి వ్యాధులకు ముఖ్య కారణాలు. మహానగరాల్లో జీవించే ప్రజల్లో ఈ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్లనే 30 ఏళ్లలోపు వారికి గుండెపోటు వస్తున్నది.

జీవనశైలిలో మార్పులు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది. ఈ నేపథ్యంలో రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగ, ప్రాణాయామం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుబంధం కొనసాగించాలి.

ఈ పరిస్థితిలో మన మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అవసరం. మానసిక ప్రశాంతత అత్యవసర ఔషధం. ప్రభుత్వం ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తమ జీవనశైలిని మెరుగు పరుచుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.

 కామిడి సతీష్‌రెడ్డి, 9848445134