రైతన్నకు అమ్మకం తిప్పలు
దేశంలో అత్యధిక ప్రజానీకానికి ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. జనాభాలో సగానికి పైగా కుటుంబాలు నేటికీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం “పంట పండించడం” వరకే పరిమితం అనుకునేవారు. కానీ, ఈ రోజుల్లో పంట పండించడం ఒకెత్తయితే... దాన్ని కాపాడుకొని, మార్కెట్‌కు తీసుకెళ్లి, మద్దతు ధరతో అమ్ముకోవడం అంతకంటే పెద్ద యుద్ధంలా మారింది.
దేశంలో, మన రాష్ట్రంలో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ, దానికి తోడు రైతుల సమస్యలు కూడా రెట్టింపవుతున్నాయి. వ్యవసాయ రంగంలో విత్తనాలు వేసేటప్పటి నుంచి పంట చేతికివచ్చే వరకు రైతులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పంట అమ్మకాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్రామాల్లో పండిన పంటను నిల్వ చేయడం కోసం ప్రభుత్వాలు సరైన స్థలాలు కేటాయించి సౌకర్యాలు కల్పించకపోవడం, ఒకవేళ కేటాయించినా రైతులందరి పంట పట్టేంత స్థలం లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారింది.
ఎంతో కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తరలించడానికి కనీసం గోనె సంచులు కూడా సకాలంలో అందకపోవడం వ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. దీనికితోడు రవాణా ఖర్చులు భారం కావడంతో రైతు మరింత కుంగిపోతున్నాడు. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరిచినా, అక్కడ సరుకు కొనడానికి అధికారులు రకరకాల నిబంధనలు పెడుతున్నారు. పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో రోజుల తరబడి రైతులను వీధుల్లోనే వేచిచూసేలా చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో క్వింటాకు ఇన్ని కిలోల ‘తరుగు’ అంటూ రైతు శ్రమను దోచుకుంటున్నారు. ఒకవేళ ఆ నిరీక్షణలో అకాల వర్షం పడి పంట తడిస్తే... కనీసం సగం ధరకు కూడా కొనే నాథుడు కరువవుతున్నాడు. దేశ జనాభాకు అన్నం పెట్టే వ్యవసాయ రంగం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు.
పంట పండిన తర్వాత రైతుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలు, గోదాములు వంటి మౌలిక వసతులు కల్పించినప్పుడే రైతుకు నిజమైన న్యాయం జరుగుతుంది. పంట అమ్ముకోవడానికి రైతులకు అన్ని విధాలా సహకరించి, మద్దతు ధరతో పాటు కొనుగోళ్లు కూడా సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.
ఉభయ్ రెడ్డి, 7670893265






