ఎబోలా ఎమర్జెన్సీ!
ఎబోలా వైరస్ మరోసారి యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ప్రస్తుతం ఎబోలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం గమనార్హం. ఈ రెండు దేశాల్లో 89కి పైగా మరణాలతో ఎబోలా వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా గుర్తించిన ఎబోలా వేరియంట్ బండిబుగ్యోకు వ్యాక్సిన్ లేకపోవడం, మరణాల శాతం 25 శాతం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి.
1976లో తొలిసారిగా గుర్తించిన ఎబోలా వైరస్ కారణంగా గతంలో గినియా, లైబీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తదితర దేశాల్లో 16 వేల మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చుట్టుపక్కల ఉన్న పేద దేశాలు అంగోలా, కాంగో, జాంబియా, టాంజానియా, దక్షిణ సూడాన్ కలవరపడుతున్నాయి. ఆఫ్రికాలోని పలు దేశాల్లో వైద్య సదుపాయాలు సరిపడా లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో భారతదేశం కూడా అప్రమత్తమైంది. మన దేశంలో ప్రస్తుతం ఎబోలా వైరస్ కేసులు నమోదు కాకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. 2014లో లైబీరియా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఎబోలా నిర్ధారణ అయిన చరిత్ర ఉండటంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పెంచారు.
ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక పర్యవేక్షణను కొనసాగిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఐసీఎంఆర్ సంస్థలు పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఎబోలా వల్ల కొవిడ్ తరహా ప్రపంచవ్యాప్త సంక్షోభం వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఎబోలా గాలిలో వ్యాపించకపోవడం, లక్షణాలు కనిపించిన తర్వాతే ఇతరులకు సంక్రమించే అవకాశం ఉండటం,
వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచేందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆఫ్రికా ఖండం మినహా ఇతర దేశాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. అయినప్పటికీ కరోనా మహమ్మారి విలయతాండవాన్ని యావత్ ప్రపంచం చవిచూసిన నేపథ్యంలో ఆఫ్రికా మాత్రమే కాకుండా అన్ని దేశాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.






