21 April, 2026 | 3:13 PM

జీవితకాలం ఎదురుచూపు

25-08-2024 12:49 AM
  1. గ్రీన్‌కార్డు కోసం ఎన్‌ఆర్‌ఐల తిప్పలు
  2. 80 నుంచి 100 ఏండ్లు పట్టే అవకాశం

న్యూఢిల్లీ, ఆగస్టు 24: అమెరికాలో పనిచేసే ప్రతి విదేశీయుడికి ఉండే కల గ్రీన్ కార్డు. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు ఆ దేశం విదేశీయులకు ఇచ్చే లైసెన్స్ ఇది. గ్రీన్ కార్డు కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఏండ్ల తరబడి ఎదుచూస్తూ ఉంటారు. అందులో సహజంగానే భారతీయులే అధికంగా ఉంటారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే.. దరఖాస్తు చేసుకొన్న తర్వాత గ్రీన్ కార్డు కోసం కనీసం 80 నుంచి 100 ఏండ్లు ఎదురుచూడాల్సి రావచ్చట.

అంటే అంతకాలం బతికి ఉంటే అప్పుడు గ్రీన్‌కార్డు లభిస్తుంది. గ్రీన్ కార్డు దరఖాస్తులను 24 నెలలలోపే పరిశీలించి పూర్తిచేస్తున్నామని అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ ఎఫైర్స్ చెప్తున్నది. కానీ, ఎన్‌ఆర్‌ఐలు మాత్రం తమ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తు పరిశీలనకు 40 నుంచి 100 ఏండ్ల సమయం పడుతుందని చూపిస్తున్నట్టు చెప్తున్నారు.

ఏటా మూడు శాతమే

  1. వివిధ దేశాల నుంచి అమెరికా గ్రీన్ కార్డు కోసం ఏటా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. కానీ, ఆ దేశం ఆమోదించేది మాత్రం వందల్లోనే.
  2. 2024లో ఇప్పటివరకు 34.7 లక్షల గ్రీన్ కార్డు దరఖాస్తులు వచ్చాయి. కానీ, ఇందులో మూడు శాతమే పరిష్కరించే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు.
  3. ఏటా 11 లక్షలకు మించి గ్రీన్ కార్డు దరఖాస్తులను పరిశీలించకూడదని ఆ దేశం నిర్ణయించింది. 
  4. గ్రీన్‌కార్డు దరఖాస్తు దారులు ఆ దేశంలో దశాబ్దాలపాటు నివసిస్తూ ఎలాంటి నేర చరిత్ర లేకుండా సరైన సమయంలో పన్నులు కడుతూ అర్హమైన వీసా కలిగి ఉండాలి.  

బతికుండగా వస్తదన్న ఆశ లేదు

దరఖాస్తులు లక్షల్లో పేరుకుపోవటంతో తమ జీవితకాలంలో గ్రీన్‌కార్డు వస్తుందన్న ఆశ లేదని సికింద్రాబాద్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ నిర్వేదం వ్యక్తంచేశారు. ‘నేను గ్రీన్ కార్డుకోసం 2005లో దరఖాస్తు చేసుకొన్నా. ప్రస్తుతం నా వెయిటింగ్ పీరియడ్ 81 సంవత్సరాలు అని చూపిస్తున్నది. నాకు ఇప్పటికే 53 ఏండ్లు వచ్చాయి. నా దరఖాస్తు ఏమైందని ఇమ్మిగ్రేషన్ వాళ్లకు ఎప్పుడు ఫోన్ చేసినా భారత్‌నుంచే కాకుండా అనేక దేశాల నుంచి కుప్పలు తెప్పులుగా దరఖాస్తులు పోగుపడి ఉన్నాయని చూపిస్తున్నారు. నా పిల్లులు కూడా గ్రీన్ కార్డు పొందలేరేమోనని అనిపిస్తున్నదని’ అని న్యూజెర్సీలో ఉండే ఆ ఎన్‌ఆర్‌ఐ ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాకు రావొద్దు

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసీ చూసీ విసిగిపోయిన కొందరు ఎన్‌ఆర్‌ఐలు భారతీయులు ఎవరూ అమెరికా రావొద్దని సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ ఇటీవల ఓ ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాను ఎంచుకోవాలని, అక్కడ అద్భుతమైన జీవితం ఎదురుచూస్తున్నదని పిలుపునిచ్చారు. ఈ ప్రకటనపై డల్లాస్‌లో ఉండే సురేశ్ అనే ఎన్‌ఆర్‌ఐ ఘాటుగా స్పందించారు.

‘దయచేసి మీరెవరూ అమెరికాకు రావొద్దు. వాళ్లు చెప్పేదంతా అబద్ధం. నా మాట నమ్మటం లేదా? గత దశాబ్దకాలంలో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వచ్చిన ఏ భారతీయ విద్యార్థినైనా అడగండి. ఇక్కడ మీ కలలకు తలుపులు మూసుకుపోయాయి. మీ విద్య పూర్తయిన తర్వాత ఇక్కడ ఏమీ ఉండదు. మీ కెరీర్ మొత్తం హెచ్1బీ వీసా కోసం పరుగులు పెట్టడమే ఉంటుంది. భారతీయులకు గ్రీన్ కార్డు రావటానికి కనీసం 100 ఏండ్లు పడుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.