21 April, 2026 | 1:46 PM

యూపీఎస్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

25-08-2024 01:13 AM

ప్రభుత్వ ఉద్యోగుల కోసం 

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్

23 లక్షల కేంద్ర ప్రభుత్వ 

ఉద్యోగులకు లాభం

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హర్యానా, జమ్ముకశ్మీర్ అ సెంబ్లీ ఎన్నికల ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభు త్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నట్టు కొత్త పెన్షన్ విధానాన్ని ప్రారంభిస్తున్న ట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు ఆమోదం తెలిపింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి యూపీఎస్ అమల్లోకి రానున్నది. యూపీఎస్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారని క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెళ్లడించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్), యూపీఎస్‌లో ఉద్యోగులు దేన్నయినా ఎంచుకోవచ్చని చెప్పారు.

బేసిక్‌లో 50 శాతం పెన్షన్

యూపీఎస్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్‌కు 12 నెలల ముందు పొందిన జీతం లో బేసిక్ పే ఎంత ఉంటుందో అందులో 50 శాతం ఆ ఉద్యోగికి పెన్షన్‌గా లభిస్తుంది. అయితే, ఆ ఉద్యోగి కనీసం 25 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసి ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ పెన్షన్ కోసం కనీసం 10 సంవత్సరాల సర్వీసును యావరేజ్‌గా తీసుకొంటారు. 

కుటుంబానికి పెన్షన్ హామీ

యూపీఎస్ ప్రకారం ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ హామీ లభిస్తుంది. ఉద్యోగి మరణిస్తే ఆ సమయంలో ఉద్యోగి పొందిన వేతనంలో 60 శాతం అతడి కుటుంబానికి పెన్షన్‌గా లభిస్తుంది. 

కనీస పెన్షన్ రూ.10,000

యూపీఎస్ ఎంపిక చేసుకొన్న ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత కచ్చితంగా కనీసం నెలకు రూ.10 వేల పెన్షన్ లభిస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీసం రూ.10 వేల పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏండ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలి. ఎన్‌పీఎస్ ప్రకారం ప్రస్తుతం పెన్షన్ స్కీంకు ఉద్యోగి 10 శాతం, కేంద్ర ప్రభుత్వం 14 శాతం కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్నది. యూపీఎస్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 18.5 శాతానికి పెరుగనున్నది. కొందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శనివారం ప్రధానిని కలిసి యూపీఎస్‌పై సంతోషం వ్యక్తంచేశారని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ఉద్యోగుల సుదీర్ఘ పోరాటం

మోదీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పక్కనబెట్టి ఎన్‌పీఎస్‌ను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎన్‌పీఎస్‌తో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండటం లేదని, అందువల్ల ఓపీఎస్‌నే కొనసాగించాలని ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. పలు బీజేపీయేతర రాష్ట్రాలు కూడా ఎన్‌పీఎస్‌ను వ్యతిరేకిస్తున్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మ్యానిఫెస్టోల్లో ఇదే ప్రధాన అంశం అయ్యింది కూడా.

అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం గత ఏడాది పెన్షన్ స్కీం సమీక్షకు కమిటీని వేసింది. కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌కే వెళ్తామని పట్టుబట్టడంతో కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కమిటీ కూడా వేసింది. ఈ కమిటీల సూచనల మేరకు కేంద్రం యూపీఎస్‌ను తీసుకొచ్చింది. ఓపీఎస్ ప్రకారం కూడా ఉద్యోగి తుడి వేతనంలోని బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా పొందేవారు. 

ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యం: మోదీ

ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్తే తమకు ముఖ్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అందుకోసమే యూపీఎస్‌ను తీసుకొచ్చామ ని ట్వీట్ చేశారు. దేశ ప్రగతిలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టం ఎంతో ఉన్నదని కొనియాడారు. యూపీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు.