రోడ్లపై పశువులను తరలించేందుకు వలంటీర్లు
గౌరవ వేతనంతో 2 వేల మందికి పైగా నియామకం
మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
భోపాల్, ఆగస్టు 24: పశువులు రోడ్లపైకి రావడం.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం.. కొన్నిసార్లు పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించడం వంటి సమస్లయకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం కనుగొన్నది. హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నేతృత్వయంలో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల సూచనలను అమలు చేయాలని నిశ్చయానికి వచ్చింది. రోడ్లపైకి వచ్చిన పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 2 వేల మందికి పైగా వలంటీర్లను నియమించాలని శుక్రవారం నిర్ణయించింది.
అలాగే పశువులను వాహనాల్లో తరలించేందుకు ప్రత్యేకంగా హైడ్రాలిక్ యంత్రాలు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ ప్రాంతంలో పశువుల సంచారాన్ని బట్టి ఒక్కో వలంటీర్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఐదుగురి సభ్యుల కమిటీలో ఒక ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. ‘వర్షాకాలంలో పశువులు ఎక్కువగా రోడ్లపైకి వస్తాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ సమస్యలకు మేం పరిష్కారం ఆలోచించాం. వలంటీర్లను నియమించి వారి ద్వారా పశువులను మేక్ షిఫ్ట్ షెల్టర్లకు తరలిస్తా’మన్నారు.






