విద్య, వైద్య రంగాల బలోపేతానికి పెద్దపీట
స్కిల్డ్, టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పేదలపై ఆర్థిక భారం పడొద్దన్నదే మా లక్ష్యం
ఇప్పటికే ఆడబిడ్డలకు రూ. 63వేల కోట్ల వడ్డీ లేని రుణాలిచ్చాం
ఆడబిడ్డలందరికీ ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన శీనన్న
తిరుమలాయపాలెం, ఆగస్టు 27 (విజయక్రాంతి): పభుత్వ విద్య, వైద్య రంగాల బలోపేతానికి, మెరుగైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో చేపట్టిన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ దివాకర. టీఎస్ తో కలిసి ప్రసంగించారు.
గత పాలకులు విస్మరించారు.. మేం చిత్తశుద్ధితో చేస్తున్నాం..
గతంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని.. ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన రెండున్నర ఏళ్లలో ఎంతో చిత్తశుద్ధితో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నా మన్నారు. పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా మన ప్రభుత్వం గత పాలకుల కంటే విద్య, వైద్య రంగాలకు రెండు మూడు రెట్లు అధికంగా నిధులు వెచ్చించిందని చెప్పారు. పేదవాడి పై ఆర్థిక భారం పడకుండా నూతనంగా ప్రభుత్వ హాస్పిటళ్లు నిర్మిస్తూ, వైద్యులు, వైద్య సిబ్బందిని నియమిస్తూ అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
స్కిల్ యూనివర్సిటీ తో మెరుగైన ఉద్యోగ అవకాశాలు
సాంకేతిక విద్య బలోపేతానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి దాని ద్వారా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంశాలపై శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామని ప్రకటించారు. వడ్డీ లేని రుణాలిచ్చి..క్షేత్ర స్థాయిలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గడిచిన రెండున్నరేళ్లలో రూ. 63 వేలకోట్ల రుణాలు ఇప్పించినట్లు వివరించారు.
అలాగే..రైతుల విషయంలో ఈ ప్రభుత్వం తొలినుంచీ రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రకటించారు. నాలుగో విడత కూడా ఇందిరమ్మ ఇళ్లిస్తాం.. అర్హులంతా పింఛన్లకు అప్లై చేసుకోండి. ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇచ్చా మని, రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కూడా ఇచ్చామని, పేదవాడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో మూడో, నాలుగో విడత కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. అర్హులంతా 31వ తేదీ నాటికి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, త్వరలోనే కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నామని అన్నారు.
పేదవారికి మౌలికంగా ఏమవ సరమో వాటన్నింటినీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో వడివడిగా వారి గుమ్మం ముందుకే చేరవేస్తున్నామని అని చెప్పేందుకు సంతోషిస్తున్నామని చెప్పారు ఈ సందర్భంగా.. కార్యక్రమానికి హాజరైన మహిళలకు, పాలేరు నియోజకవర్గ, రాష్ట్ర ఆడబిడ్డలందరికీ ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






