దేవదుర్గ పసిడిగని
- బంగారం, రాగి తీసి దేశ సంపదను పెంచుదాం
- కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ
- ప్రారంభంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్‌తో భేటీ
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): కర్ణాటకలోని దేవదుర్గ గని(Devadurga mine) నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. బొగ్గు మైనింగ్(coal mining)లో కలిసి నడుద్దామని, కర్ణాటక జెన్కో క్యాప్టివ్ బొగ్గు గనులలో జాయింట్ వెంచరుగా పనిచేయడానికి సింగరేణి సిద్ధమని కర్ణాటక ఇంధన మంత్రి కేజే జార్జ్‌కు భట్టి ప్రతిపాదించారు.
దీంతో జార్జ్ సానుకూలంగా స్పందించారు. రాయచూరు జిల్లా, దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని అధికారికంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఖనిజ అన్వేష ప్రదేశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. దాదాపు 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ఫ్లోరేషన్ (అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు తనయు డు, కాంగ్రెస్ నాయకుడు రవి బోసురాజు, స్థానిక సర్పంచ్ ఎల్లమ్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా లింగదహళ్లిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను భట్టి విక్రమార్క పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ సీకే వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కుల శ్రేష్ట, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజాప్రతిని ధులు, సింగరేణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనలో భాగంగా కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్‌తో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ పురోగతి, బొగ్గు సరఫరా, బొగ్గు కొనుగోళ్ల చెల్లింపులపై చర్చించారు.






