పళ్ల బురుసు చూసినప్పుడు మనసు బరువెక్కింది!
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘పళ్లబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నటుడు నాగర్జున అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “పళ్ల బురుసు’ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు.
మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలి. నేను ఈ సినిమా చూశాను. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నా. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.
అన్నపూర్ణ కాలేజీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చినప్పుడు తెలంగాణ కల్చర్‌పై ఎందుకు ఒక సినిమా తీయకూడదని అడిగారు. ‘పళ్ల బురుసు’ తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన చక్కని కథ” అన్నారు. ఈ చిత్ర కథానాయకుడు, నటుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు 79. ఇది హీరోగా నాకు మూడో సినిమా. నేను నటించిన దాదాపు అన్ని సినిమాలకు అవార్డులు వచ్చాయి. ‘పళ్ల బురుసు’ అనే పేరు వినడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ సినిమా చూడటానికి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది.
ఈ సినిమాను చూసి ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు” అన్నారు. నటుడు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. “నాగేశ్వరరావు, రామారావుల సినిమాలు చూసి పెరిగిన నాకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇలాంటి అవకాశం వస్తుందని జీవితంలో ఊహించలేదు. ‘పళ్ల బురుసు’ అందరినీ అలరిస్తుందని, ఆనందపరుస్తుందని నమ్ముతున్నా” అని తెలిపారు. డైరెక్టర్ ఉదయ్ చౌహన్ మాట్లాడుతూ.. “మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలు, సన్నివేశాలను నేను పరిశీలించిన అంశాలను ఇందులో చూపించాను. మనం పళ్లు తోముకోవడానికి ఉపయోగించే ఒక వస్తువుతో ఒక కథ చెప్పాలి, ఒక చిన్న విషయాన్ని పెద్ద కథగా మార్చాలి, అందులో కొత్తదనం, తాజాదనం తీసుకురావాలి అనే ఆలోచనతో చేశాను.
అందరి మనుసులని హత్తుకునే సినిమా ఇది” అని చెప్పారు. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం నాకు ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నాన’ని నిర్మాత వివేక్ కృష్ణాణి తెలిపారు. నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. “చాలా స్వీట్ స్టోరీ. ఇందులో చాలా లోతైన సందేశం కూడా ఉంది. ఈ సినిమా చేయడం మాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలాంటి కథను చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. తాతయ్య ఉండి ఉంటే కచ్చితంగా ‘మంచి పని చేశావు’ అని చెప్పేవారు” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజ్వల్, గోమతి, మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్, లిరిసిస్ట్ సురేశ్ గంగుల కూడా మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.






