తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలి
- డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలి
- మెస్సీ టూర్‌కు సింగరేణి నిధులు ఎందుకు వాడారు
- అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తాం.. జైల్లో పెడతాం : మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రేపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఫుట్ బాల్ మ్యాచ్ కోసం వాడిన రూ.110 కోట్లపై విచారణ వేసి కారకులను బొక్కలో వేయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే వారందరితో ప్రజాభ వన్ ముట్టడిస్తామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్‌ను శనివారం మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హరీశ్‌రావు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న దుర్మార్గాలను సింగరేణి డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
40 వేల సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులే.. వారిని నియమించి ఉద్యోగులను, సంస్థను కాపాడింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. కార్మికులపై పగపట్టినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, కాళ్లులేని వారిని, కండ్లు కనిపించని వారిని, గుండెకు బైపాస్ సర్జరీ అయిన వారిని కూడా ఉద్యోగం చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి హయాంలో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని, కరంట్‌కు బొగ్గును తీసుకుని బిల్లులు చెల్లించడం లేదని, సింగరేణి అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని, జీతాలకు డబ్బులు లేక ఓడీ తీసుకుని జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. రేవంత్ వచ్చాక రూ. 50,000 కోట్ల అప్పుల్లో సింగరేణి ఉందని, ఆర్థికమంత్రిగా ఉండి సింగరేణి గొంతు కోయ డం తగునా అని ప్రశ్నించారు.
‘నీ సోకుల కోసం ఫుట్ బాల్ ఆడటం కోసం సింగరేణికి చెందిన రూ.10 కోట్లను ఎలా ఖర్చు చేస్తారని, నీ అయ్య సొమ్మా అది రేవంత్‌రెడ్డి అని నిలదీశారు. భట్టి విక్రమార్క.. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. లేదంటే వారందరితో నీ ఇల్లు ముట్టడి చేస్తామని హెచ్చరించారు.




