నడుములోతు నీటిలో నడిస్తేనే.. మల్లికార్జునుడి దర్శనం!
సాధారణంగా ఆలయాలు జనావాసాలు.. నదులు, జలాశయాల తీరాల్లో వెలుస్తుంటాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలోని చిన్ననీటి వనరు (చెరువు) మధ్యలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి మహిమాన్విత శైవక్షేత్రంగా విరాజిల్లుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. జిల్లాలోని ఇచ్చోడ మండలం సిర్మిచెల్మ గ్రామంలోని ప్రాచీన శైవక్షేత్రం కాకతీయుల కాలం నాటిది. 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఆలయంలో అప్పటి శాసనం సైతం చెక్కబడి ఉంది. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి పురాతన చరిత్రే ఉంది. శతాబ్దాల క్రితం ఆ పరమశివుడు లింగరూపంలో వెలిశాడని గ్రామస్తులు కథలుగా చెబుతారు. మరికొందరు శతాబ్దాల కిందట ఈ గ్రామాన్ని నీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధించింది. స్వామి స్వయంగా బాలుడి రూపంలో సంతా నం లేని దంపతుల ఇంటికి వెళ్లాడని, వారి సమస్యలను గమనించిన మల్లికార్జున స్వామి స్వయంగా చెరువును తవ్వి దాని మధ్యలో కొలువుదీరినట్లు మరో కథ ప్రాచూర్యంలో ఉంది.
గర్భగుడిపై సూర్యకిరణాలు
ఈ ఆలయం తూర్పుముఖ ద్వారంలో ఉండి సూర్యుడు ఉదయించగానే కిరణాలు నేరుగా గర్భగుడిలో పడుతుంటాయి. అపురూపమైన శిల్పసంపద ఈ ఆలయ సొంతం. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం ఎదుట రెండు నంది విగ్రహాలు ఉండటం మరో విశేషం. ఇంకా ఈ ఆలయ ఆవరణలో శివపార్వతుల విగ్రహాలు, కార్తికేయుడు, శ్రీవేంకటేశ్వరస్వామి, వినాయకుడు, సప్త మాతృకలు, అష్ట లక్ష్మీ, ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు, జైన తీర్థంకరుడైన వర్ధమాన మహవీరుడి విగ్రహాలు ఉన్నాయి.
ఆలయం యేడాదిలో ఎనిమిది నెలల పాటు నీటి మధ్యలోనే ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో ఈ ఆలయానికి వచ్చే భక్తులు నడుము లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి ఇష్ట దైవాన్ని దర్శించుకుంటారు. తక్కువ నీటిమట్టం ఉంటే తాడును పట్టుకుంటూ భక్తులు ఆలయంలోకి వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. అదే నీటిమట్టం కొద్దిగా ఎక్కువగా ఉంటే నాటుపడవల్లో వెళ్తుంటా రు. ప్రతి సోమ, శనివారాల్లో ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు చేస్తారు.
శివరాత్రికి ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి సందర్భంగా సిరిచెల్మలోని మల్లి కార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతోపాటు జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు ఇక్కడికి తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి)




