10 April, 2026 | 8:27 AM

కనకాయ్ గొప్ప రాజ్యం

28-12-2025 12:00 AM

*తెలంగాణ చరిత్రలో కనకాయ్ ది ప్రత్యేక అధ్యాయం. ఆ ప్రదేశంలో లభించిన మట్టి పూసలు, గాజుముక్కలు..  2,3 కి.మీ.లు పొడవైన రాతిగుండ్లు పరిచిన బాట, దాని పక్కన వున్న పోస్ట్ హోల్స్( స్తంభాల గుంటలు) ఒకప్పుడు అక్కడ దుకాణాల అంగళ్లకు సాక్ష్యాలు. అక్కడ దొరికిన కుండపెంకులు క్రీ.పూ. 700సం.లనాటివని పరిశీలనలో తేలింది.  కనకాయ్‌లో క్రీ.పూ. 1000సం.ల నుంచే  తొలి చారిత్రక సంస్కృతి ఉండేదని విదేశీ పరిశోధకులు తేల్చారు. అంటే సాతవాహనులకు పూర్వం నుంచే ఇక్కడ గొప్ప రాజ్యం ఉండేదని అక్కడ లభ్యమైన ఆధారాలతో చరిత్ర కారులు చెబుతున్నారు.  తొలినాళ్ల తెలంగాణ చరిత్ర యాత్రలో విశేష ప్రదేశం కనకాయ్ అని చిరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. కనకాయ్ చరిత్ర, ఆ ప్రదేశం విశేష వివరాలు ఆయన మాటల్లోనే.. 

పూర్వకాలపు పౌరాణిక కణ్వమహర్షికి తన తపశ్శక్తితో లభించిన కూతుళ్లు గిరిజాయి, బూతాయి, అరకాయి, కనకాయిలట. కనకాయి కణ్వమహర్షి చిన్నకూతురు. కనకాయి కనకాయ్‌లోని కోటలో ఉండి అడిగిన వాళ్లకు బంగారం ఇచ్చేదట. పిలిస్తే పలికెడిదట. ఎవరో అవమానకరంగా మాట్లాడినప్పటి నుంచి శిలగా మారిపోయిందని స్థానికులు చెప్పుకుంటారు.

ఈ ప్రదేశంలోని దుర్గ నిర్మాణం, దానికి వేసిన రాళ్లు పరిచిన బాట చూసి, పూర్వమిది గోండుల కోట అని, కనకాయ్ రాజ్యమని, శత్రువుల దాడిలో ధ్వంసమైందని అనుకున్నాం. గిరిజనులు తమకై యుద్ధాలలో పోరాడి మరణించిన తమ నాయకులను, పాలకులను దేవుళ్లుగా ఆరాధించడం వారి సంప్రదాయం. తమ ప్రియతమ రాణి కనకాయ్‌నే దేవతగా పూజిస్తున్నారు. కనకాయ్‌కి జాతర చేసినపుడు అక్కడే గుడికి ఎదురుగా ఉన్న సిరిమానును పూజించి జెండాకట్టడం, జాతరచేయడం గిరిజన సంప్రదాయమే. 

కనకాయ్ ముగ్గురక్కల 

పేర్లమీద నాలుగు ఊర్లు  

2013 అక్టోబర్ 16న నేను, వేముగంటి మురళీకృష్ణ, మురళి అన్న రఘునందన్, విధుమౌళి, బాలకిషన్, నాని కలిసి ఆదిలాబాద్ (ప్రస్తుతం నిర్మల్) జిల్లా ఇచ్చోడ దగ్గరి (పిప్రి), బజార్ హత్నూర్ మండలంలో కనకాయ్ అనే పురాతన గోండ్ (అంధ్?) రాజ్యపు కోట చూడ్డానికి వెళ్లాం. వర్ధమానుకోట సర్పంచ్, పిప్రి సర్ఫంచ్, అక్కడి విలేకరులు, యువకులు మాకు దారి చూపుతూ మా వెంట వచ్చి అక్కడి విశేషాలన్ని చూపించి, వివరించారు.  కనకాయ్ దారిలో మొదటే నాలుగైదు ఆదిమానవుల సమాధులు (రాతికుప్పలు, సిస్తులు, డోల్మన్లు టోపి రాళ్లతో ) కనిపించాయి. అక్కడనుంచి రాతిగోడల వంటి నిర్మాణాలు, ఆవాసాల శిథిలాలు దారిపొడుగున కనిపించాయి. కొంత దూరం పోయాక రాతిబాట (రోడ్డు ) కోటదాకా ఉంది. ముందరొక కోటబురుజు శిథిలస్థితిలో వుంది. 

జలపాతాల కనువిందు

అటుపక్కన కడెం నది ప్రవాహం జలపాతాలై కనువిందుగా.... మధ్యలో పాతకుండ ముక్క దొరికింది. అక్కడో రోలు కనిపించింది. సానరాయి ముక్క, నూరే రాళ్లు , పెద్దసైజు ఇటుకలు, ఇనుం చిట్టెం లభించాయి. కనకాయ్ కోటలోకి ప్రవేశించే ముందర కొలను (నీటిమడుగు) వుంది. కనకాయి గుడి (ఇటీవలే చినకప్పు ఏర్పరిచారు)లో కనకాయి (కనకదుర్గ అంటున్నారు) దేవ తావిగ్రహం. అవతలి పక్క ఉత్తరంగా నాగదేవతగా చెప్పబడే బొమ్మలేని పలకరాయి ఉంది. కనకాయి గుడిలో గద్దెలాగా పరచిన రాళ్లన్ని పాతగుడి కట్టడపురాళ్లే. గుడిముందర తిరుమాను (సిరిమాను) చెట్టు, చెట్టుకు జాతరపుడు గిరిజనులు కట్టే జెండాలు కనిపించాయి.  

దుర్గారూపం.. గోరక్షాసనం

కనకాయ్‌లో చూసిన కనకాయ్ దేవతా విగ్రహం చతుర్భుజి. వెనక కుడిచేతిలో త్రిశూలం, ముందు కుడిచేతిలో ఖడ్గం, వెనక ఎడమచేతిలో సర్పంతో ఢమరుకం, ముందు ఎడమచేతిలో రక్తపాత్ర. చిన్న కిరీటం. దుర్గారూపం. అయితే దేవత గోరక్షాసనంలో కూర్చుని ఉంది. కనుక ఈ దేవత తాంత్రిక దేవతాశిల్పం అనవచ్చు. అక్కడ చూసిన దేవాలయ శిథిలాల్లో దేవాలయ జగతిరాళ్లు, కప్పుశిల, గోడల రాళ్లు, కొన్ని విరిగిన స్తంభాలు అగుపిస్తున్నాయి. దేవతాపీఠం మీద నాలుగురేకుల పుష్పం లాంఛనంగా ఉంది. దేవతావిగ్రహం కొత్తదన్నట్టు అనిపిస్తున్నది. పాతవిగ్రహాన్ని దొం గలు అపహరిస్తే కోత్త విగ్రహం చేయించి పెట్టామని సర్పంచ్ తెలిపారు.

స్తంభానికి నలువైపులా ఉల్బణ శిల్పాలు

కనకాయ్ దేవాలయం ముందరి స్తంభానికి నాలుగువైపులా ఉల్బణ శిల్పాలు ఉన్నాయి. వాటిలో మొదటివైపు ఒకవీరుడు యుద్ధంలో శత్రుసంహారం చేస్తున్నాడు. అతని ఎడమచేతిలో గదవంటి ఆయుధం, కుడిచేతిలో ఆయుధం కొంచెం అస్పష్టం. ఎడమకాలితో గుర్రాన్ని తన్నుతున్నట్టు, అతని కాళ్ల నడుమ కూలిపోయిన శత్రువులు కనిపిస్తున్నారు. రెండవవైపు అశ్వారోహితుడైన యోధుడు తన ఎడమకాలితో తొక్కి వధిస్తున్నాడు. అతని కింది వరుసలో భటులు సాయుధులై, డాళ్లతో కనిపిస్తున్నారు. మూడోవైపు శిల్పం పెద్దతలతో వున్న మనిషి పెద్దకొమ్ము కుడిచేత్తో , ఎడమ చేత్తో ఏనుగు వంటి జంతువు నెత్తినట్లుగా, ఆ పైన మరేదో జంతువు బొమ్మలున్నాయి.. నాలుగోవైపు ఇద్దరు వీరులు ధనుర్బా ణాలు ధరించి కనిపిస్తున్నారు. ఇన్ని శిల్పాలున్న ఈ స్తంభం ఏ చారిత్రక సందర్భానికి సాక్ష్యంగా నిలిచిందో తెలుసుకోవడం సాధ్యపడలేదు.

పాతరాతియుగం పనిముట్లు

కనకాయ్ కోటకు వెళ్లే దారిలోనే కనిపించిన పురాతన మానవుల సమాధుల ప్రాంతం లో, కనకాయ్ గుడి నుంచి తిరిగివొచ్చే దారిలో కొన్ని రాతిపని ముట్లు దొరికాయి. వాటిలో దోకుడు (చాపర్) రాయి, స్క్రూడ్రైవర్ వంటి పరికరం, మైక్రోలిథ్స్ వున్నాయి. ఠాకూర్ రాజారాంసింగ్ ఈ ప్రాంతం లో పాతరాతియుగం నుంచి మధ్యరాతియుగం దాకా రాతిపనిముట్లు విరివిగా దొరికినట్లు తన నోట్స్ లో రాసుకున్నాడు. ఈ పనిముట్లు ఈ ప్రాంతమంతా ఒకప్పుడు పురాతన మానవుల ఆవాసాలుండేవని, వేలసంవత్సరాలుగా నివసించినట్లు వారి పనిముట్లు, ఇతర ఆధారాలతో చెప్పవచ్చు. చారిత్రక కాలానికి సంబంధించి ఈ కనకాయ్ గోండు రాజ్యంలోని ఒక కోట. అక్కడ లభించిన ఇటుకలు సాతవాహన కాలానికి చెందినవి. అందువల్ల ఇక్కడ సాతవాహనకాలం నుంచే రాజ్యమేదో ఉండేదని సందేహించ వలసి వస్తున్నది.

బౌద్ధకథల శిల్పాలతో స్తంభం

2008లోనే కనకాయ్ ని సందర్శించిన ప్రసిద్ధ చరిత్రకారులు వివి కృష్ణశాస్త్రి, జితేంద్రబాబు, జైకిషన్, సూర్యకుమార్‌లు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ... మా సందేహం నిజం చేస్తూ కనకాయ్ ఒకప్పుడు సాతవాహనకాలం నాటి కోట అని, అక్కడొక రోమన్ల శైలి ఆంఫీథియేటర్ వుండేదని, బౌద్ధజాతక కథల శిల్పాలతో స్తంభముందని, కనకాయ్‌ని తర్వాత కాలంలో అక్కడికి చేర్చి కనకాయ్ గుడిగా మార్చారని...అక్కడ పురాతన మానవుని రాతిపనిముట్లు, ఇనుం వస్తువులు దొరికాయని జైకిషన్‌తో సంభాషణలో తెలిసింది. 

ఏ గ్రేట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. 

వీ హావ్ టు డూ మోర్..

శ్రీరామోజు హరగోపాల్