3 May, 2026 | 10:08 PM

మాట నిలుపుకున్న మంత్రి

23-08-2025 12:00 AM

ముఖ్యమంత్రి గారు వేదిక మీదికి వస్తూ నా మాటలు విని, ‘ఎవరాయన సి.నారాయణరెడ్డిలా మాట్లాడుతున్నాడు’ అని నిర్వాహకుల్ని అడిగాడు. ‘ఆచార్య నారాయణరెడ్డి గారి శిష్యుడు’ అని వారు సమాధానామిచ్చారు. కొంతసేపు వేదిక నధిరోహించి పోతే సరిపోతుందని ముఖ్యమంత్రి గారు భావించారు. అదే సమ యంలో నేను అంతకుముందే తయారు చేసుకున్న కవితతో వారిని వేదిక మీదికి ఆహ్వానించాను. 

అది 1990వ సంవత్సరం. మర్రి చెన్నారెడ్డిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సికింద్రాబాద్ లోని వెస్టు మారే డ్‌పల్లి ‘పద్మశాలి కళ్యాణ మండపం’ ప్రారంభోత్సవం జరిగింది. దాన్ని ప్రారంభించడానికి డా॥ చెన్నారెడ్డి గారు వచ్చా రు. సమయాభావం వల్ల రిబ్బన్ కట్‌చేసి వెళ్లాలనుకున్నారు. కానీ సభావేదిక గొప్పగా అలంకరింపబడడం ముఖ్యమం త్రి గారిని ఆకర్షించింది.

రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది పద్మశాలి సోదరులు సభకు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అట్టి ప్రారంభో త్సవ సభకు నేను వ్యాఖ్యాతగా ఉన్నాను. ఓ.యూలో ఆచార్యునిగా ఉండడం వల్ల నాకు ఆ గౌరవం లభించింది. ఎన్నో కార్యక్రమాలుండడం వల్ల ముఖ్యమంత్రి గారు కొద్దిసేపే ఉండి వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు. నేను నా సహజశైలిలో వ్యాఖ్యానం మొదలు పెట్టాను.

ముఖ్యమంత్రి గారు వేదిక మీదికి వస్తూ నా మాటలు విని, ‘ఎవరాయన సి.నారాయణరెడ్డిలా మాట్లాడుతున్నాడు’ అని నిర్వాహకుల్ని అడిగాడు. ‘ఆచార్య నారాయణరెడ్డి గారి శిష్యుడు’ అని వారు సమాధానామిచ్చారు. కొంతసేపు వేదిక నధిరోహించి పోతే సరిపోతుందని ముఖ్యమంత్రి గారు భావించారు. అదే సమ యంలో నేను అంతకుముందే తయారు చేసుకున్న కవితతో వారిని వేదిక మీదికి ఆహ్వానించాను. 

‘గోల్కొండను సిరా బుడ్డిచేసి,

గండిపేటను సిరాగా మార్చి

పిల్లలమర్రిని కలంలా చేసుకొని

ఈ కాళ్యాణ మండపంలో కూర్చొని 

ముఖ్యమంత్రిని గూర్చి కవిత రాయాలనిపిస్తుంది’ అనేవి ఆ కవితా పంక్తులు. 

ముగ్ధులైన ముఖ్యమంత్రి..

ముఖ్యమంత్రి గారు నా కవితను విని ముగ్ధులయ్యారు. చేతిలోని దండం ఊపు తూ నవ్వునవ్వారు. పావుగంటలో కార్యక్రమం ముగించుకొని వెళ్లాలనుకున్న చెన్నారెడ్డి గారు ఆనాటి సభలో రెండు గంటలు ఉండటం విశేషం. ఆ సభలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉండాలి, కానీ ఏ కారణాల చేతనో వారు సభకు రాలేదు. ఐతే వారు పంపిన సందేశాన్ని వేదిక మీద నేనే చదివాను.

సభ అనుకున్న దాని కంటే బాగా జరగడం, చెన్నారెడ్డి గారు నలభై నిమిషాలపాటు ప్రసంగించడం ప్రేక్షకులకెంతో సంతోషాన్ని కల్గించింది. సభ ముగిసిన తర్వాత ఖద్దరు దుస్తుల్లో ఉన్న ఒక పొడవైన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. వారిని నేను గుర్తించ లేదు. కానీ వారు తన చేతిని నా భుజం మీద వేసి ‘నేను పులి వీరన్నను, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేని, మీరు బాగా మట్లాడారు, సభ విజయవంతం కావడానికి సగం మీరే కారణం’ అని నన్న భినందిచారు.

నేను వారి మాటలకెంతో పొంగిపోయాను. ఒక ఎమ్మెల్యే నన్నంతగా మెచ్చుకున్నాడంటే మాటలా ! ‘మీరెక్కడుంటారు’ అని అడిగారు. ‘నేను వారాశి గూడలో ఉంటాను’ అన్నాను. వెంటనే నేను ‘మీరు మా ఇంటికి అతిథిగా రావచ్చుగా’ అన్నాను. ఇప్పుడు కాదు, మంత్రి నైన తర్వాత తప్పక వస్తాను అన్నారు. మర్నాడు పత్రికలో ఒక పద్మశాలి లెక్చరర్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మీద కవిత్వం చెప్పినాడనే వార్తను చదివి, గురువు గారు సి.నారాయణరెడ్డి గారు నన్నడిగారు. ‘నువ్వే కదా ఆ కవిత చెప్పింది’ అని, అంతేకాదు అభినందించారు కూడా. 

పులి వీరన్నతో స్నేహం..

ఆ తర్వాత కొద్ది కాలానికి కోట్ల విజయ భాస్కరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. వారి మంత్రి వర్గంలో పులి వీరన్నగారు మంత్రిగా నియమింపబడినారు. పులి వీర న్న మంత్రి కావడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లిన ప్రతినిధి వర్గంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున నేను న్నాను. మంత్రి ఐన తర్వాత కూడా పులి వీరన్న గారు నన్నెంతో అభిమానించారు.

పాలమూరులో కవి సమ్మేళనం ఏర్పాటు చేసి సన్మానించారు. అట్లా వారితో నాకు స్నేహం పెరిగింది. నేనున్న వారాశిగూడకు సమీపంలో అంబర్‌నగర్ అనే కాలనీ ఉం ది. ఆ కాలనీలో ఎక్కువగా చేనేత కార్మికులే ఉంటారు. కాలనీ ఏర్పడ్డప్పుడే కాలనీ వా సుల సౌకర్యార్థం మార్కండేయ మందిరానికి కొంత స్ధలం కేటాయించారు. కానీ దానిలో ఒక కండబలం కల్గిన వ్యక్తి మ ద్యం దుకాణాన్ని నడుపుతున్నాడు.

కాలనీ వాసులు దైవవశాన నన్ను సంప్రదించారు. నేను స్థానిక రాజకీయనాయకుల సహకారంతో ఆ మద్యం దుకాణాన్ని అక్క డి నుంచి తరలింపజేశాను. అంతేకాదు, ప్రముఖ పద్మశాలి వ్యాపారస్థులు అందించిన విరాళాలతో మార్కండేయ దేవాలయ నిర్మాణం చేశాను. ఇది స్థానికంగా నేను సాధించిన విజయమని చెప్పవచ్చు. 

మా ఆతిథ్యాన్ని స్వీకరించి

దేవాలయంలో కేవలం అర్చనలే కాకుండా, సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలన్న తలంపుతో ఒకరోజు ‘హెల్త్‌క్యాంపు’ నిర్వహించాను. ఆ క్యాంపులో ఎంతో మంది డాక్టర్లు పాల్గొని, స్థానికులకు ఆరోగ్య పరీక్షలు చేసి ఉచితంగా మం దులిచ్చారు. ఆనాటి కార్యక్రమానికి ప్రారంభకులుగా నేను పిలిచిందే తడవుగా పులి వీరన్న గారు వచ్చారు. వారికెంతటి జ్ఞాప కం ఉందో మరి ! ‘ఇక్కడికి మీ ఇల్లెంత దూరం?’ అని అడిగారు.

‘దగ్గరే’ అన్నాను. వారు సంతోషంగా తన సెక్యూరిటీతో మా చిన్న ఇంటికి వచ్చి రెండు గంటలున్నారు. మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. వెళ్లేప్పుడు ‘నేను మీకు మాట ఇచ్చినట్లు, మీ ఇంటికి వచ్చాను. సంతోషమే కదా !’ అన్నారు. ఇప్పటి దాకా తన మాట నిలుపుకున్న మంత్రి పులి వీరన్నను నేను మరచిపోలేదు. 

వ్యాసకర్త సెల్: 9885654381