26 August, 2026 | 7:01 PM

ఘనవాద్యం చెంచు జేగంట

12-06-2024 02:30 AM

శ్రీశైలం నుంచి శతాబ్దాల కిందట మహబూబాబాద్ ప్రాంతానికి తరలివచ్చిన చెంచులు తమ సంప్రదాయ జేగంటని ఇంకా వాడుతున్నారు. నల్లమల్లలోని చాలా ప్రాంతాలలో జేగంట శబ్దం మూగబోయింది. కాని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్న చెంచులు దానిని కాపాడుకున్నారు. ప్రతి ఊరిలో కంచు జేగంటలు వినిపిస్తాయి. అంతేకాదు తమకు హక్కుగా ఇవ్వబడిన పట్టీ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వారికి ప్రత్యేక వేషధారణ ఉంటుంది. 

నెత్తిమీద నెమలి ఈకల గూడును ఉంచుకుంటారు. ఈ ఆహార్యం చూపరులకు విస్మయం కలిగిస్తుంది. ఒక చేతిలో జేగంట వాయిస్తూ మరో చేతిలో వేణువుకి ఉడతలు, అడవి పిల్లులు, ఎలుకలు, ఎంటువలు, ఉడుం వంటి చిన్న జీవాల చర్మాలను ఒకచోట కడతారు. దానికి ఒక చిన్నగంటని కడతారు. వేణువుతో పాటు పట్టుకున్న ఒక బొమ్మ, దానిని కట్టిన చెక్క నిర్మాణం ఉంటుంది. ఆ బొమ్మ ముత్తవ్వ అనే స్త్రీది. ఆమె ఈ చెంచులకు బిచ్చం వేయదు. వేయనివ్వదు.

అందుకే ఇప్పటికీ ఆమె బొమ్మను చూపుతూ ఈ విషయాలు పాడతారు. జేగంట అందుకు అనుగుణంగా వాయిస్తారు. నిజానికి పిల్లంగోయిని మోగిస్తూ జేగంట వాయించడంలో వింత శబ్దం పుడుతుంది. వీరి మెడలో ఒక చిన్న గంట కట్టుకుంటారు. వీరి ప్రతి కదలిక సంగీతమయం. వారి శరీరం నాలుగు వాద్యాలు, మూడు రకాల వాద్యాలతో ధ్వనిస్తుంది. అందుకు తగినట్లుగా చిన్న చిన్న పదాలతో ఒక లయలో పాట పాడుతుంటారు. చెంచు జేగంట వాయించే వారిని చూస్తే ప్రాచీన కాలపు గిరిజన సంగీత సంప్రదాయ అవశేషాలు గుర్తొస్తాయి.