ఎవరు కాకతి దేవత?
విద్యానాథుని ప్రతాపరుద్రీయంలో, కుమారస్వామి సోమపీథి రత్నాపణవ్యాఖ్యలో కాకతీదేవతను హిందూదేవతగా చెప్పిన వ్యాఖ్యానాలు వున్నాయి. దొండపాడులోని కాకతమ్మబీడులో తవ్వించి దొరికిన అమ్మదేవతల నుంచి వేటూరి ప్రభాకరశాస్త్రి చాముండ (సప్తమాతృకలలో సౌమ్యంగా ఉండే దేవత)నే కాకతిగా నిర్థారించాడు. కానీ, ఏ దేవీపురాణాల్లో కానీ, దేవీనామాల్లో కానీ కాకతిపదం కనిపించదు.
కాకర్త్య పదోత్పత్తికి సంబంధించి అనేక చర్చలు జరిగాయి. కాకర్త్య పదమే కాకతిగా పరిణమించిందని ఎక్కువమంది చరిత్రకారులు అంగీకరించారు. కాకతి, కాకత్య, కకెత అనేవి కాకతిదేవతనామ రూపాంతరాలు. కాకతీయులు మొదట జైనులు. అందులోను వారు దిగంబరజైన పంథాను అనుసరించేవారు. కాకర్త్య గుండన వరకు వారికి కాకతీయులనే వంశనామం లేదని తెలుస్తున్నది. గుండన ఇంటిపేరు ‘కాకర్త్య’ నుంచి వచ్చిన రూపాంతర నామాలే కాకత, కాకతి, కాకెతి, కాకితలనేవి.
అయితే కాకతి అనే మాటకు గుమ్మడితీగ అని అర్థముందని, గుమ్మడి పదానికి ‘కూష్మాండం’ సంస్కృతీకరణమని అందరు చెప్పారు. జైనయక్షిణులలో కూష్మాండిని అంబికాదేవికి పర్యాయనామం. అంబిక జైనయక్షిణులలో 22వ తీర్థంకరుడు నేమినాథుని శాసనదేవత. ఈ దేవతారూపం దిగంబర, శ్వేతాంబర జైన భేదాలతో ఉంటుంది. దిగంబరులు కూష్మాండిని అని, శ్వేతాంబరులు అంబిక అని పిలుచుకుంటారు. ఎక్కువమట్టుకు ప్రతిమాలక్షణం ప్రకారం దేవత కుడిచేతిలో మామిడిపండ్లు, ఎడమచేతిలో నిమ్మ(జాతి) పండు, లేదా ఒడిలో ఎడమ చేతితో పట్టుకున్న శిశువు ఒకరు లేదా ఇద్దరుంటారు.
లలితాసనంలో మామిడిచెట్టునీడలో కూర్చుని ఉంటుంది. ఇట్లాంటి రూపలక్షణాలతో ఉన్న గుట్టకు దక్షిణంవైపు చెక్కిన జైన శిల్పాలు పార్శనాథుడు, మహావీరులతో పాటు చెక్కబడి ఉన్నది. ఎడమవైపున మామిడిచెట్టు కింద సుఖాసనంలో కూర్చున్న ఈ దేవతతో పాటు ఆమెకిరుపక్కలవున్న ఇద్దరు పుత్రులలో ఒకడు ఎదురుగా సింహంపై కూర్చునివున్నాడు. దేవత కుడిచేతిలో కాడవున్న ఫలం (ఆమ్రం), ఎడమచేతిలో నిమ్మజాతి పెద్ద ఫలం ఉన్నాయి.
మనదేశంలో 5వ శతాబ్దం నుంచి కనిపించే అంబికాదేవి గురించి జైన పురాణాల్లో చెప్పబడింది. జైనంలోనే ఎక్కువగా ఆరాధించబడింది. జినప్రభసూరి సంకలించిన గ్రంథం ‘అంబికాదేవి కల్ప’ లో అంబికాదేవి (కూష్మాండి, కూష్మాండినీ) ‘కోహండవిమానమ’నే స్వర్గంలో ఉండే దేవత. ఇది శ్వేతాంబర జైనం కథ. సాధారణంగా జైన ఐకనోగ్రఫీ ప్రకారం ఇద్దరు ఇద్దరు శిశువులు (సిద్ద, బుద్ద), మామిడిపండ్ల గుత్తి, పాశంతో అంబిక శిల్పం ఉంటుంది. లభిస్తున్న అంబికరూపాలను బట్టి రెండు చేతులతో, నాలుగు చేతులతో, నాలుగు కంటే ఎక్కువ చేతులతో దిగంబర, శ్వేతాంబర భేదాలతో అంబిక రూపాలుంటాయి. జైన దేవత అంబిక పుట్టుక గురించి పరిశోధకుడు ఉమాకాంత్ పిషా ‘ఐకనోగ్రఫీ ఆఫ్ ద జైన గాడ్‌నెస్ అంబిక’ జర్నల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ బాంబేలో రాశాడు.
జినప్రభసూరి ‘ఊర్జయంతస్తవ’లో అంబిక సింహవాహిని, ఇద్దరుపుత్రులు సిద్ద, బుద్దులతో చేతిలో మామిడిపండ్ల గుత్తితో జైనసంఘాన్ని కాపాడుగాక’ అని ఉంది. అంబిక ప్రస్తావన ‘జినభద్రగాని క్షమాశ్రమణ’ ‘విశేషావశ్యక మహాభాష్య’ లో అంబా కూష్మాండవిద్య అని, దిగంబర తాంత్రిక గ్రంథం ‘విద్యాశాసన’లో 8 చేతుల ‘ఆమ్రకూష్మాండిని’ అని ఉంది. వస్తుపాల జైనమంత్రి అంబిక ప్రార్థనలో ‘కూష్మాండిని పద్మాలయ’ అని ఉంది. అందువల్లనే కావచ్చు పద్మాక్షిగుట్టమీద నిర్మించిన జైనబసది ‘కడలాలయ బసది’గా పిలువబడ్డది. కాయోత్సర్గభంగిమలో ఉన్న తీర్థంకరునికి, ఇరుపక్కల యక్షిణి అంబిక, యక్షుడు ‘సర్వం సహా’ జినభద్రవచనాచార్య చేత అంకితం చేయబడ్డారు.
‘అనుయోగద్వారసూత్ర’ అనే గ్రంథంలో “అజ్జేవా దుగ్గేవా కొత్తాకిరియేవా ఉవాలేవసమ్మజ్జనా సణవరి సణధువ పుష్పగంధమాల్లుయం దువ్వావస్సాయైం కరేంతి” అని ఉంది. దీనిని వ్యాఖ్యానించిన హరిభద్రసూరి ‘జినదాస మహత్తర’లో “దుర్గాయా పూర్వరూపం ఆమ్రకూష్మాండివత్ తధా థితా అజ్ఞా భన్నతి శైవ మహిష వ్యాపాదానకళా ప్రభృతి తద్రూపస్థిత కొత్తవ్యా(కొత్తాకిరియ), భన్నతి” అని వివరించాడు. హరిభద్రసూరి ‘కొత్తాకిరియ’ను కొత్తాకురియ, కొత్తవి అన్నాడు. ‘కొత్తాకిరియ’ నే కాకరితియ, కాకర్త్యగా పరిణమించి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కూష్మాండిని కొత్తావి, కొణ్ణివై (అంటే వనదుర్గ, విజయప్రదాత)గా పూజింపబడుతున్నది. పై ఆధారాలను బట్టి కొత్తాకిరియకు కాకరితయ (కాకర్త్య)కు పద సంబంధముందని తెలుస్తున్నది. కొత్తాకిరియ కొత్తకురియ, కొత్తవి, కొణ్ణివైగా పరిణమించడం అర్థం చేసుకోవచ్చు. అంబిక లేదా కూష్మాండినియే కాకతి అని, దిగంబర జైనపంథాను అనుసరించినందువల్లే గుండన కాకర్త్య(కాకతి) ఆరాధకుడుగా కాకర్త్యగుండన అని పిలువబడ్డాడు.
‘ప్రస్తుతం శైవదేవతగా పూజలందుకుంటున్న అనుమకొండ సమీపంలోని గుట్టమీద పద్మాక్షిదేవి నిస్సందేహంగా జైనదేవతే. జైన తీర్థంకరుల బొమ్మల నడుమ ఉన్న దేవీవిగ్రహం శైవదేవత కావడానికి వీల్లేదు. మొదట ఉన్న జైనదేవత విగ్రహం తరువాతి కాకతీయుల శైవమతావలంబనకు అనుగుణంగా శైవదేవత రూపాన్ని సంతరించుకున్నది. ముందు చెప్పిన జైనగాథ శైవగాథగా మారిపోయింది. అన్మకొండ గుట్టమీద జైనదేవతను గరుడబేతరాజు లేదా మొదటి బేతరాజు ప్రతిష్టించి ‘కాకతి’ అని పేరు పెట్టాడని ఊహించడం అసమంజసం కాదు’ అని “కాకతీయులు’లో పివి పరబ్రహ్మశాస్త్రి రాశారు.
పద్మాక్షి గుట్టలోని దేవాలయంలో ప్రవేశించగానే కనబడే ‘సర్వంసహా’ అనబడే యక్షుడు, కాయోత్సర్గ భంగిమలో తలపై త్రిస్తరఛత్రంతో 22వ జైన తీర్థంకరుడు నేమినాథుడు, అవతల కూష్మాండిని లేదా అంబి, ద్విబుజిగా, రెండు చేతుల్లోను ఫలాలతో కాకతీయుల కులదేవత కాకతి ఉంది. వీటికి కొంచెం పక్కగా వినాయకుడు, లలితాసనంలో చాముండేశ్వరి, ఆమె పాదాలకింద అంబిక శిల్పం, వాటి వెనక పూర్తిగా చెక్కకుండ నిలిచిపోయిన 24వ జైన తీర్థంకరుడు మహావీరుని 7 అడుగుల ఎత్తున శిల్పం. దాని పక్కన జైనపాదాలు, జైన చౌవిసస్తంభం, చౌవిస విగ్రహఫలకం ఉన్నాయి. ఇవన్నీ దిగంబర జైన ప్రతిమలే. ప్రతిమా లక్షణాలను బట్టి, జైనసబది ప్రాచీనతను బట్టి పద్మాక్షిగుట్టమీది పద్మాక్షిదేవతే కాకతిదేవత.
శ్రీరామోజు హరగోపాల్






