16 July, 2026 | 7:15 AM

కొత్త జంట.. పరుగుల పంట

20-04-2024 12:55 AM

కలిసి కొడుతున్న నయా ద్వయం పంజాబ్ కొత్త కెరటాలు శశాంక్, అశుతోష్

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్లో స్టార్ జోడీలకు కొదవేలేదు! 

సచిన్ హెడెన్ నుంచి మొదలుకొని.. వార్నర్  కోహ్లీ ధోనీ ఇలా జంటగా పరుగులు రాబట్టిన వాళ్లు కోకొల్లలు. పరస్పర నమ్మకం, సమన్వయం ఉంటేనే ఇది సాధ్యమని గతంలో అనేకసార్లు రుజువైంది. టీమ్‌ఇండియా తరఫున ధోన్ర్తీ కలిసి క్రీజులో ఉన్నప్పుడు ఇలాంటి సమన్వయం స్పష్టంగా కనిపించేది. కేవలం కను సైగలతోనే సహచరులను పరుగు కోసం పిలవడం.. తమకు అలవాటైన సైగలతోనే సింగిల్ వచ్చే చోట రెండు పరుగులు తీయడంలో ఈ జోడీని మించిన వారు లేరు. తాజా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టును నిశితంగా గమనిస్తే.. ఇలాంటిదే ఒక కొత్త జంట కనిపిస్తోంది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో మిడిలార్డర్‌లో క్రీజులోకి వస్తున్న శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ జోడి ఇలాంటి సమన్వయంతోనే పరుగులు రాబడుతోంది. స్లాట్‌లో బంతి దొరికితే చాలు దానిపై ఆకలిగొన్న సింహాల్లా విరుచుకుపడుతున్న ఈ ఇద్దరిపై ప్రత్యేక కథనం..

విజయక్రాంతి, ఖేల్ విభాగం

ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ అయిన మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ ఆటకు దూరం కాగా.. మెరుపు వేగంతో మ్యాచ్‌లను ముగించే ప్లేయర్ కోసం టీమిండియా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ ఇలా చాలా మందిని ప్రయత్నించి చూసింది. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మరోసారి ఫినిషర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెగా టోర్నీ కోసం మే 1 లోపు జట్లను ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో.. బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తోందనడంలో సందేహం లేదు. టీమ్ సెలెక్షన్‌కు ఐపీఎల్ ప్రదర్శనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే బోర్డు వెల్లడించగా.. యువ ఆటగాళ్ల ఆటతీరును సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇప్పటి వరకు టోర్నీలో 34 మ్యాచ్‌లు ముగియగా.. పలువురు ప్లేయర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దంచికొడుతున్న పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెరుపు ఆరంభాలిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ తురుపుముక్క రియాన్ పరాగ్ సత్తాచాటారు. వీరి పేర్లు చాన్నాళ్లుగానే వినిపిస్తున్నా.. ఊహించని మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా పోటీలోకి వచ్చినట్లే అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. వారిద్దరూ మరెవరో కాదు పంజాబ్ తరఫున అంచనాలు లేకుండా బరిలోకి దిగి అదరగొడుతున్న అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్! ఈ సీజన్‌తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అశుతోష్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే పంజాబ్ జట్టులో కీలక ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

అయితే మిగిలిన జట్టు సభ్యులు పెద్దగా రాణించకపోవడంతో ఈ ఇద్దరి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదనేది వేరే విషయం. అయినా ఈ ఇద్దరి శ్రమను మాత్రం తక్కువ చేసేందుకు లేదు! ఈ సీజన్‌లో పంజాబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింటి ఫలితాలు చివరి ఓవర్‌లోనే తేలగా.. వాటిని అక్కడి దాక తీసుకెళ్లడంలో శశాంక్, అశుతోష్ పాత్ర ఎంతో ఉంది. శశాంక్ 7 మ్యాచ్‌లాడి 62.33 సగటు.. 179.80 స్ట్రయిక్ రేట్‌తో 187 పరుగులు చేయగా.. అశుతోష్ శర్మ నాలుగు మ్యాచ్‌ల్లోనే 205.26 స్ట్రయిక్ రేట్‌తో 156 రన్స్ కొట్టాడు. ఈ ఇద్దరు చేసిన పరుగులను లెక్కలోకి తీసుకోవడం కంటే.. వాటిని సాధించిన సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ ఇన్నింగ్స్‌ల విలువ బాగా అర్థమవుతుంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ పనైపోయిందని అంతా భావించినా.. ఈ జోడీ చివర్లో ధనాధన్ షాట్లతో విరుచుకుపడి కింగ్స్ ను గెలిపించింది. ముంబైతో పోరులో బుమ్రా, కోట్జీను ఎదుర్కొంటూ ఈ ఇద్దరూ పంజాబ్‌ను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నిం చిన తీరు క్రీడాభిమానులను కట్టిపడేసింది.  

అది నా కల

భారత ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎప్పటికైనా స్వీప్ షాట్ కొట్టాలని కలలు కనేవాడిని. దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా సాధనచేశా. ఆటలో ఇలాంటి లక్ష్యాలు సహజమే. మొత్తానికి నా కల నెరవేరింది. పంజాబ్ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్ సంజయ్ బంగర్ మాటలు నాలో స్ఫూర్తినింపాయి. శర్మ

అశుతోష్ శర్మ

మ్యాచ్‌లు 4

పరుగులు 156

సగటు 52.00

అత్యధిక స్కోరు 61

స్ట్రయిక్ రేట్ 205.26

అంపైరింగ్ వదిలి..

మధ్యప్రదేశ్‌కు చెందిన అశుతోష్ రాంబాబు శర్మది నిరుపేద కుటుంబం. దేశంలో ఎందరో ఔత్సాహిక క్రీడాకారుల్లాగే అత్యున్నత స్థాయికి చేరాలని కలలుగన్న 25 ఏండ్ల అశుతోష్‌ను పేదరికం అడుగడుగునా అడ్డుపడింది. అయితే నమ్మినదాని కోసం ఎంత కష్టపడేందుకైనా ముందుండే అశుతోష్ బతుకుదెరువు కోసం చిన్నా చితకా పనులెన్నో చేశాడు. రోజంతా ఎండలో నిలబడి అంపైరింగ్ చేస్తే.. మూడొందల రూపాయలు వస్తాయంటే.. మూడు రోజుల భోజనం ఖర్చులకు సరిపోతాయని ఆ పనికి సైతం ఒప్పుకున్నాడు. చాలీచాలని డబ్బులతో ఇరుకు గదుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఏ రోజు ఆటపై మక్కువ వదులుకోలేదు.

అయితే భారత మాజీ క్రికెటర్ అమే కురేసియా పరిచయం అశుతోష్ జీవితాన్ని మార్చేసింది. మెరుగైన శిక్షణ లభించడంతో పూర్తి స్థాయిలో ఆటపై దృష్టి పెట్టిన అతడు మధ్యప్రదేశ్ తరఫున లిస్ట్ మ్యాచ్‌ల్లో రాణించి వార్తల్లోకెక్కాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న అశుతోష్.. 2019 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్లో 84 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత కూడా తిరిగి బెంచ్‌కే పరిమితం కావాల్సి రావడంతో అతడిలో అసహనం పెరిగినా.. ఆటతో అనుబంధం కొనసాగించేందుకు అంపైర్‌గానూ వ్యవహరించాడు. అయితే 2023 ముస్తాక్ అలీ ట్రోఫీ అశుతోష్ జీవితాన్ని మలుపుతిప్పింది.

అంతర్జాతీయ టీ20ల్లో 12 బంతుల్లో అర్ధశతకం చేసిన యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టడంతో అశుతోష్ పేరు మార్మోగింది. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదడంతో పొట్టి పార్మాట్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ అశుతోష్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసుకుంది. ఈ సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు బెంచ్‌పై కూర్చోబెట్టినా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చింది. ఐపీఎల్లో ఆడిన తొలి పోరులో 31 పరుగులు చేసిన అశుతోష్.. ఆ తర్వాత హైదరాబాద్‌పై 33 నాటౌట్, రాజస్థాన్‌పై 31, ముంబైపై 61 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లన్నీ జట్టు ఆశలు వదిలేసుకున్న క్లిష్ట సమయాల్లో.. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోతున్న వేళల్లో కావడంతో వీటి విలువ మరింత పెరిగింది. బలమైన హై బ్యాక్ లిఫ్ట్‌తో భారీ షాట్లు ఆడటం అశుతోష్‌కు వెన్నతో పెట్టిన విద్య కాగా.. సీజన్ మొత్తం ఇదే తరహా కొనసాగిస్తే.. అతడిని టీ20 ప్రపంచకప కో సం టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్ మరింత పెరగడం ఖయామే! 

మెరుపులు ఇప్పుడే!

శశాంక్ సింగ్ చాన్నాళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్నా.. ఈ సీజన్‌లోనే అందరి దృష్టి ఆకర్షించగలిగాడు. 32 ఏండ్ల శశాంక్ 2017లో ఢిల్లీ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2019 నుంచి 21 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అక్కడి నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి.. చివరకు పంజాబ్ గూటికి చేరాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయిన శశాంక్.. ఈ సీజన్‌లో తనలోని విధ్వంసక బ్యాటర్‌ను ప్రపంచానికి చూపాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకుంటున్న శశాంక్.. గుజరాత్‌పై పోరులో తనలోని హిట్టర్‌ను వెలికితీశాడు.

కేవలం 29 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేశాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సైతం శశాంక్ 25 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 46 పరుగులు చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన చోట.. శశాంక్ తెగువ కనబర్చాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేశాడు. అతడితో పాటు అశుతోష్ కూడా రాణించడంతో మ్యాచ్ దాదాపుగా పంజాబ్ వశమైనా.. ఆఖర్లో బుమ్రా, కోట్జీ చక్కటి బౌలింగ్‌తో పంజాబ్‌కు అడ్డుకట్ట వేశారు. ఈ సీజన్‌లో దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్న శశాంక్ మున్ముందు మరింత నిలకడ కనబరిస్తే.. పంజాబ్ కోర్ గ్రూప్‌లో భాగమయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. 

శశాంక్ సింగ్

మ్యాచ్‌లు 7

పరుగులు 187

సగటు 62.33

అత్యధిక స్కోరు 61*

స్ట్రయిక్ రేట్ 179.80