31 August, 2026 | 1:03 AM

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం

31-08-2026 12:04 AM
  1. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు
  2. రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా
  3. విద్యా, వైద్యం, రహదారి, నీటిపారుదల రంగాల అభివృద్ధికి భారీగా నిధులు
  4. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి
  5. చింతకాని, బోనకల్ మండలాల్లో రూ.131.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం

మధిర, ఆగస్టు -30(విజయక్రాంతి): దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్ మండలాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

చింతకాని మండలంలోని కొదుమూరు ఎస్సీ కాలనీలో రూ.66 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, లచ్చగూడెంలో రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి, రూ.1.75 కోట్లతో లచ్చగూడెం నేరడ పీఆర్ రహదారి వరకు చింతకాని వందనం ఆర్‌అండ్బీ రహదారి నుంచి బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ.7 కోట్లతో లచ్చగూడెం అనంతారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. చింతకాని గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.44 లక్షలతో, నాగిలిగొండ ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, నాగిలిగొండ నుంచి తూటికుంట్ల వరకు రూ.5.25 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

బోనకల్ మండలంలోని నారాయణపురం ఎస్సీ కాలనీలో రూ.63 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రూ.1 కోటితో ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, రాయన్నపేట ఎస్సీ కాలనీలో రూ.19 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. నారాయణపురంలో రూ.80.84 లక్షలతో నిర్మించిన 1,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పీఏసీఎస్ గోదాంను, మోటమర్రిలో రూ.24.50 లక్షలతో నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పీఏసీఎస్ గోదాంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.

అదేవిధంగా కలకోట -  రాపల్లిగన్నవరం ముసలిమడుగులక్ష్మీపురం రహదారిని రూ.57 కోట్లతో కిలోమీటర్ 0/0 నుంచి 20/0 వరకు వెడల్పు చేసి పటిష్టం చేసే పనులకు, బ్రాహ్మణపల్లిగన్నవరం మీదుగా రాపల్లి వరకు ఉన్న పీడబ్ల్యూడీ రహదారిని రూ.26 కోట్లతో కిలోమీటర్ 0/0 నుంచి 8/0 వరకు వెడల్పు చేసి పటిష్టం చేసే పనులకు శంకుస్థాపనలు చేశారు.

రాపల్లిలో రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ  నేటి ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం కోసం అనేకకార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. 

విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు..

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ 100 ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మంజూరు చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని రూ.200 కోట్ల నిధులతో 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నా మని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ విద్యార్థులు చిన్ననాటి నుంచే ఒకే కుటుంబంలా కలిసి చదువుకునేలా ఈ పాఠశాలలను నిర్మిస్తున్నామని, తద్వారా సామాజిక మార్పుకు నాంది పలుకుతున్నా మని తెలిపారు.

తెలంగాణలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మంజూరు చేశామని అన్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు మెస్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచామని తెలిపారు.

రోడ్లు, నీటిపారుదల, వైద్య రంగాలకు భారీగా నిధులు..

రాష్ట్రంలోని రహదారి నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు రూ.90 వేల కోట్లతో పలు ప్రణాళికలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

స్‌ఎల్బీసీ టన్నెల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణను పూర్తిచేయడానికి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, అదనంగా 14 వేల పడకలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ భీమా:

మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను వడ్డీ లేకుండా అందిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. వడ్డీ లేని రుణాల పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచిందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం క్రింద రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. దేశంలో మరేరాష్ట్రంలో లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ వ్యక్తులు కృషి చేస్తున్నారని, వారి వలలో ప్రజలు పడవద్దని డిప్యూటీ సీఎం సూచించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని, అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన అజెండా అని, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్,సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్, విద్యుత్ శాఖ సీఈ అశోక్, ఎస్‌ఈ శ్రీనివాస చారి, ఆర్‌అండ్బీ ఎస్‌ఈ యుగంధర్ రావు, పీఆర్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, సీపీఓ శ్రీనివాస్, హౌజింగ్ పీడీ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.