సెల్లార్లలో అక్రమ వ్యాపారాలు
- నిబంధనలకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు
- ప్రమాదాల ముప్పు ఉన్నా పట్టించుకోని అధికారులు
- చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో భవనాల సెల్లార్లను పార్కింగ్ కోసం కేటాయించినప్పటికీ, వాటిలో నిబంధనలకు విరుద్ధంగా వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలోని ముషీరాబాద్, రాంనగర్, అడిక్మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్లోని పలు ప్రాంతాల్లో పార్కింగ్కు ఉపయోగించాల్సిన సెల్లార్లను వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో భవనాలకు వచ్చే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
నిబంధనలకు తూట్లు
భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికారులు గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొందరు వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
పార్కింగ్‌కు బదులు వ్యాపారాలు
సెల్లార్లు పార్కింగ్ కోసం అందుబాటులో లేకపోవడంతో భవనాల వద్దకు వచ్చే వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రధాన రహదారులు, కాలనీల్లో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.
ప్రమాదాల ముప్పు ఉన్నా చర్యలు శూన్యం
సెల్లార్లలో అధిక రద్దీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల అగ్నిప్రమాదాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను సురక్షితంగా బయటకు తరలించడం కష్టమవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వినియోగిస్తున్న భవనాలపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.
ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్
సెల్లార్లలో కొనసాగుతున్న వ్యాపార కార్యకలాపాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణ అనుమతులు, పార్కింగ్ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ వ్యాపారాలను వెంటనే నియంత్రించాలని కోరుతున్నారు.






