15 June, 2026 | 1:31 AM

ప్రజల మనసులు గెలిచిన పోలీస్ అధికారి

15-06-2026 12:13 AM

సీఐ అశోక్ రెడ్డికి ప్రెస్ క్లబ్ ఘన సన్మానం

అశ్వాపురం, జూన్ 14 , (విజయక్రాంతి): అశ్వాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రెండేళ్ల మూడు నెలల పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రజల మన్ననలు పొందిన సీఐ అశోక్ రెడ్డిని ఆదివారం సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అశ్వాపురం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఆయన సేవలను ఘనంగా కొనియాడారు. కార్యక్రమంలో మాట్లాడిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డి మహేష్ మాట్లాడుతూ, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్కు సీఐ అశోక్ రెడ్డి ఒక నిలువెత్తు నిర్వచనం‘ అని పేర్కొన్నారు.

పోలీస్ అంటే ప్రజల్లో ఉండే భయాన్ని తొలగించి, నమ్మకం కలిగించేలా ఆయన విధులు నిర్వహించారని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి బాధితులకు అండగా నిలిచిన అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. అశ్వాపురంలో విధులు నిర్వహించిన కాలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

ప్రజా సేవే ధ్యేయంగా నిరంతరం పనిచేసిన అశోక్ రెడ్డి సేవలను అశ్వాపురం ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. సన్మానానికి స్పందించిన సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అశ్వాపురం ప్రజలు, మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది అందించిన సహకారం వల్లే తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించగలిగానని చెప్పారు. తనపై చూపిన ఆప్యాయత, గౌరవానికి సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.