6 March, 2026 | 7:30 AM

భారతజాతి ఆత్మగీతం

27-12-2025 12:00 AM

భారత జాతీయ చైతన్య చరిత్రలో డిసెంబర్ 27 చిరస్థాయిగా నిలిచిన దినం. భారత జాతీయ గీతమైన ‘జనగణమన’ తొలిసారిగా ప్రజా సమక్షంలో ఆలపించబడిన రోజు ఇది. 1911, డిసెంబర్ 27న కలకత్తాలో జరి గిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఈ గీతం మార్మోగింది. దేశమంతా రాజకీయ చైతన్యం, జాతీయ భావోద్వేగాలతో ఉవ్వెత్తున లేచిన సందర్భం అది. అలాంటి సమయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘జనగణమన’ గీతం తొలిసారి సభావేదికపై వినిపించి భారతీయుల హృదయాలను ఏకం చేసింది.

దేశ భౌగోళిక విస్తృతి, సాంస్కృతిక వైవిధ్యం, ఆధ్యాత్మిక ఏకత్వాన్ని ఒకే సూత్రంలో చెప్పబడిన అపూర్వ సాహిత్య సృష్టి ఇది. అయితే ప్రారంభ దశలో జనగణమనకు ఒక నిర్దిష్టమైన స్వరరచన లేదు. ఎవరికిషమొచ్చిన రీతిలో వాళ్లు పాడుకునేవారు. ఈ గీతానికి స్థిరమైన సంగీత రూపం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో రూపుదిద్దుకున్న సంగతి చాలామందికి తెలియదు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మేధోపరమైన బలాన్ని అందించిన డాక్టర్ అన్నీ బెసెంట్ స్థాపించిన మదనపల్లె థియోసాఫికల్ కాలేజీ ఈ చారిత్రక ఘట్టానికి వేదికైంది.

ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఐరిష్ జాతీయవాది, ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ పనిచేశారు. ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీత బోధన చేస్తుండేవారు. 1919లో దక్షిణ భారతదేశ పర్యటన సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ మదన పల్లెకు చేరుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకు న్నారు. ప్రతి బుధవా రం భోజనం అనంత రం విద్యార్థులంతా కలి సి పాటలు పాడే సంప్రదాయం అక్కడ ఉండే ది. ఒక సందర్భంలో ఠాగూర్ స్వయంగా తన గొంతుతో ‘జనగణమన’ను ఆలపించారు.

ఆ గీతంలోని దేశభక్తి, జాతీయ భావం మార్గరెట్ కజిన్స్‌ను విశేషంగా ఆకర్షించింది. ఆ గీతానికి శాశ్వతమైన స్వరబద్ధత అవసరమని భావించిన మార్గరెట్ కజిన్స్, ఠాగూర్ అనుమతి తీసుకొని విద్యార్థినుల సహకారంతో స్వర రచన పూర్తిచేశారు. ఆ స్వరంతో విద్యార్థులు గీతాన్ని ఆలపించగా, ఠాగూర్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.  మద నపల్లెను విడిచి వెళ్లే ముందు ఆ ప్రాంతాన్ని ‘దక్షిణ భారతదేశపు శాంతినికేతన్’గా ఆయన కొనియాడారు. 

దేశానికి స్వాతంత్య్రానంతరం 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ‘జనగణమన’ను అధికారిక జాతీయ గీతంగా స్వీకరించింది. జనగణమన గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి 52 సెకన్లు పడుతుంది. ఠాగూర్ రచించిన ఈ గీతానికి మొత్తం ఐదు చరణాలు ఉన్నప్పటికీ, కొన్ని రాజకీయ, చారిత్రక కారణాల వల్ల మొదటి చరణాన్ని మాత్రమే జాతీయ గీతంగా స్వీకరించారు.

భారతదేశ సమైక్యతకు, సార్వభౌమత్వానికి, సాం స్కృతిక ఏకత్వానికి ఇది అద్భుతమైన ప్రతీకగా నిలిచింది. జాతీయ గీతం పాడే సమయంలో దాని అర్థాన్ని, నేపథ్యాన్ని, చరిత్రను మననం చేసుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి హృదయంలో నిలిపే శక్తి ‘జనగణమన’కు ఉంది. అందుకే అది కేవలం ఒక గీతం కాదు భారత జాతి ఆత్మగీతం.

 రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494