19 July, 2026 | 2:15 AM

ఎస్‌ఎంఏ బాధితులకు ఆశాకిరణం

19-07-2026 12:00 AM
  1. గచ్చిబౌలిలో ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ’ 4వ ఎడిషన్
  2. ఎస్‌ఎంఏ పోస్టర్ విడుదల చేసిన సైబరాబాద్ సీపీ డా.రమేష్ 

శేరిలింగంపల్లి, జూలై 18 (విజయక్రాంతి): స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు క్యూర్ ఎస్‌ఎంఏ ఇండియా ఆధ్వర్యంలో రన్ ఫర్ ఎస్‌ఎంఏ రెండు వేల ఇరవై ఆరు నాలుగో ఎడిషన్ ఆగస్టు తొమ్మిదవ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ కార్యాలయంలో ఈ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రి సీనియర్ జెనెటిసిస్ట్ డాక్టర్ రాధా రమా దేవి, నిమ్స్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సూర్యప్రభ, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సిఇఓ నవేద్ ఆలం ఖాన్ తో పాటు వైద్య, పరిశోధన నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్యూర్ ఎస్‌ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎస్‌ఎంఏ అవగాహన మాసంలో భాగంగా ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇరవై ఒక్క కిలోమీటర్లు, పది కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్లు టైమ్డ్, అలాగే ఐదు కిలోమీటర్లు నాన్ టైమ్డ్ వర్గాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. రన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి టీషర్ట్, మెడల్, సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు.అరుదైన, జన్యుపరమైన వ్యాధి స్పునల్ మస్క్యులర్ అట్రోఫీ పై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధిత కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యమని ఆమె వివరించారు.