గచ్చిబౌలి ఆనంద దేవస్థానంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
శేరిలింగంపల్లి,జూలై 18(విజయక్రాంతి): కొండాపూర్ డివిజన్ రోలింగ్ హిల్స్ లోని గచ్చిబౌలి ఆనంద దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జగన్నాథ రథయాత్ర మన ధర్మం, సమానత్వం, ఐక్యతకు, భారతీయ సంస్కృతికి నిదర్శనమని అన్నారు.భక్తితో యాత్రలో పాల్గొనడం వల్ల అందరం ఒక్కటే అనే భావన కలుగుతుందన్నారు.
బీజేపీ ఎల్లప్పుడూ మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందని తెలిపారు.యువత భారతీయ విలువలు, సంస్కృతిని తెలుసుకొని ధర్మాన్ని కాపాడాలని, పండుగలు, యాత్రలు సమాజాన్ని ఒక్కటి చేసే శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. జగన్నాథ స్వామి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.






