18 May, 2026 | 4:12 PM

జూనియర్ ఎన్టీఆర్‌కు ఊరట

20-06-2024 12:49 AM

డీఆర్టీ విచారణ చేపట్టాలి: హైకోర్టు తీర్పు

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది.  జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టిన జూ.ఎన్టీఆర్ ఇంటిపై బ్యాంకులకు హక్కులున్నాయంటూ డీఆర్డీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో ఎన్టీఆర్ కొనుగోలు చేశాక అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టినట్లు లాయర్ చెప్పారు. 1996లోనే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి యజమాని రుణం పొందారని, అందువల్ల వాటిపై హక్కులు తమవేనంటూ ఎస్బీఐ, ఓబీసీ, ఇండస్‌ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా సర్ఫేఖాస్ చట్టం కింద నోటీసులు జారీ చేశాయన్నారు.

ఈ వ్యవహారం డీఆర్టీకి చేరిందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమన్నారు. దీనిపై హైకోర్టు, డీఆర్టీ ఆర్డర్‌ను సవాల్ చేసేందుకు వేరే ప్రత్యామ్నాయం ఉందని, అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని సూచించింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసిన కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇరుపక్షాల వాదనలను మళ్లీ విని నిర్ణయం తీసుకోవాలని డీఆర్టీని ఆదేశించింది.