9 July, 2026 | 1:01 AM

కొలువుల భర్తీలో ‘మార్పు’ ఏది?

09-07-2026 12:00 AM

తెలంగాణలో నిరుద్యోగులకు ఏళ్లుగా నిరాశే మిగులుతున్నది. స్వరాష్ట్రంలోనూ వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలిచ్చింది. ‘మార్పు’ తమతో సాధ్యమనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి పంపి ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకుంది.

ఇక ఆచరణలో సుమారు 30 నెలలు దాటుతున్నా ‘చెప్పింది కొండంత.. చేసింది గోరంత’ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ పాలన కొనసాగుతోంది. గత సర్కారులో ఇచ్చిన నోటిఫికేషన్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి, ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై మాత్రం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా పోలీస్ నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆత్రుతగా, ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టింది.

నాడు హామీలు ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వ అధినేతే స్వయంగా నమ్మకద్రోహం చేయడంతో నిరుద్యోగులు ఓ రకంగా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఎంతో కాలంగా దేహదారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణులు కావడం కోసం ఏండ్ల తరబడి గ్రౌండ్లకు, లైబ్రరీలకు పరిమి తమైన నిరుద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో సర్కారు తీరుకు వ్యతిరేకంగా వందలాది మంది నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లో భారీ నిరసన చేపట్టారు.

అయినా సర్కారు తలొగ్గడం లేదు. అత్తెసరు పోస్టులతో ఖాళీల భర్తీకి సమాయత్తమవుతోంది. స్వపరిపాలనలోనూ నిరుద్యోగుల తెలం‘గానం’ పాలకులకు వినబడటం లేదు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తరఫున సుమారు 14 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదిక పంపామని, సర్కారు ఆమోదంతో త్వరలో నోటిఫికేషన్ రావచ్చని నాటి పోలీస్ బాస్ పేర్కొన్నారు. కానీ, సుమారు 7 వేల పోస్టులతో పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు అడుగులు పడుతున్నాయి.

దీంతో సర్కారు కనీసం 20 వేల కానిస్టేబుల్/ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు కారణాల రీత్యా ప్రభుత్వం సంఖ్యను తగ్గించొచ్చు. కానీ, ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే నినాదాలపై ఏర్పడిన తెలంగాణ సమాజ ఆకాంక్షలను ప్రతిబింబించకపోతే అది ‘ప్రజాపాలన’ ఎలా అవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2015 డిసెంబర్ 31న 9,281, 2018 డిసెంబర్ 31న 16,925, 2022 ఏప్రిల్‌లో 15,644 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు. సగటున ప్రతిసారి 10 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు 7 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇదేనా అసలైన ‘మార్పు’? అని యువత ప్రశ్నిస్తున్నది.

అంతేకాదు ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో జాతీయ సగటు కన్నా ఎక్కువ నేరాలు నమోదవుతున్న నేపథ్యంలో పోలీస్ నియామకాలను పెంచాలని నిరుద్యోగులు, మేధావులు కోరుతున్నారు. క్రైమ్ రేట్ తక్కువగా ఉన్నపుడే ఆ ప్రాంతంలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉంటా యని సర్కారు గుర్తించాలి. నిరుద్యోగుల ఆవేదనను మంచి మనసుతో అర్థం చేసుకుని పోలీసు నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలనే డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి వస్తున్నది. ఇప్పటికైనా పోస్టు ల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

అంబీర్ శ్రీకాంత్

 వ్యాసకర్త సెల్: 81859 68059