08-11-2025 12:00:00 AM
డాక్టర్ కె వీరస్వామి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980వ దశకం చివరి వరకు విద్యార్థి సంఘాల ప్రభావం విద్యా సంస్థల్లో అధికంగా ఉందనేది వాస్తవం. తెలంగాణ రా ష్ర్టం.. విద్యార్థుల పోరాటాల పునాదులపై నిర్మితమైంది. అంతకముందు 1969 నాటి తొలి దశ ఉద్యమం నుంచి 2009లో మ లి దశ ఉద్యమం దాకా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి మూలస్తంభాలు విద్యార్థులే అన్న సంగతి మరువద్దు. బీసీ రిజర్వేషన్ల పోరాటాలైనా, తెలంగాణ ఉద్యమ పోరాటాలైనా విద్యార్థులు కదం తొక్కిననాడు ప్రభుత్వాలు కూడా దిగిరావాల్సిన పరిస్థితులు ఎన్నోసార్లు కనిపించాయి.
దీనికి తగ్గట్లే కళాశాలల్లో 1984 వరకు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగేవి. అయితే అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏ కారణం లేకుండా విద్యార్థి సంఘాల ఎన్నికలను అప్రజాస్వామికంగా రద్దు చేశారు. దాని ఫలితమే ఈ రోజుల్లో కళాశాలలన్నీ రౌడీలకు, గుండాలకు, గ ంజాయి, మత్తుమందు, ర్యాగింగ్ మొదలైన భూత లక్షణాలకు కేంద్రాలుగా మారి పోయాయి.
మరోవైపు కళాశాలల్లో విద్యా వాతావరణం పూర్తిగా క్షీణించడంతో అ టు ఉపాధ్యాయులు.. ఇటు విద్యార్థులు బాధ్యతారాహితంగా తయారయ్యారు. మ రోవైపు ప్రభుత్వ విద్యాలయాలన్నీ నిర్వీ ర్యం అవుతుంటే.. విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చిన’ అన్న చందంగా పరిస్థితులు మారిపోయాయి.
అడుగుడుగునా వివక్షే!
ఎన్టీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 1986లో బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. అయితే ఇవి అమలు కాకుండా కొన్ని సంఘ విద్రోహ శక్తులు అడ్డుపడ్డా యి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ‘నవ సంఘర్షణ సమితి’ పేరుతో అగ్రకుల విద్యార్థులు ఉద్యమాలు చేసి వాటిని రద్దు చేసేదాకా విడిచిపెట్టలేదు. ఆ కాలంలో ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ.. ‘మనం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అలాగని అనుకూలం కాదు.. ఎందుకంటే రిజర్వేషన్ల ద్వారా సమా నత్వం రాదు’ అని పేర్కొనేవారు.
మనది తటస్థ వైఖరి అని చెపుతూనే తమ గ్రూపు ల్లో నుంచి బీసీ విద్యార్థి నాయకులు ఎవరైనా రిజర్వేషన్ అను కూల ఉద్యమంలో పాల్గొంటే వారి ని బహిష్కరించడం లేదా వారే బలవంతంగా వెళ్లిపోయేలా చేసేవారు. అం తేకాదు వామపక్ష సంఘాల్లోని అగ్ర కుల విద్యార్థి నాయకులు చాలా మంది బీసీ విద్యార్థులను ఉద్దేశించి.. ‘మీరు బీసీ నాయకులు కావాలనుకుంటున్నారా?’ అని ఎగతాళి చేస్తూ విమర్శలకు దిగేవారు.
దీంతో ఆ సమయంలో కొంతమంది బీసీ విద్యార్థులు.. బీసీ సంఘాల పేరుతో ఉద్యమించినా ఏమాత్రం ఫలితం లేకుండా పో యింది. అప్పటి నుంచే వామపక్ష విద్యార్థి సంఘాలకు బీసీలు మెల్ల మెల్లగా దూరమవ్వడం మొదలైంది. బీసీ విద్యార్థుల్లో చాలా మంది బయటికి వచ్చేసినప్పటికీ.. కొంతమంది మాత్రం తప్పుడు నిర్ణయాలతో వామపక్ష సంఘాల్లో మిగిలిపోయి నిరాదరణకు గురయ్యారు. వామపక్ష సంఘంలోని అగ్ర కులాలకు చెందిన వాళ్లలో చాలా మంది తమను తొక్కేస్తున్నప్పటికీ కక్కలేక.. మింగలేక అన్న తరహాలో ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి, ఎదురుతిరిగే ధైర్యం లేక విలువలను విడిచిపెట్టి అందులోనే కొనసాగారు.
విధానాలకు ఆకర్షితులై..
మరోవైపు వీటన్నిటిని గమనించిన అప్పటి ప్రభుత్వం అదే అదనుగా భావించి ఏవేవో కారణాలను చూపి విద్యాలయాల్లో ఎన్నికలను నిషేధించింది. ప్రజాస్వామిక వాతా వరణాన్ని తొలగించి కళాశాలల్లో, యూనివర్సిటీల నిర్వహణలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రాతినిధ్యం లేకుండా చేశారు. దీనికి తోడు అదే కాలంలో అప్ప టి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ నూతన ఆర్థిక విధానంలో భాగంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దేశమంతటా కళాశాలల్లో ఎన్నికలు లేకుండా చేయడంలో విజయవంతమయ్యారు.
కేవలం సెంట్రల్ యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పటికీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ కాలంలో విద్యార్థి సంఘాలన్నీ దాదాపుగా వివిధ పార్టీలకు అనుబంధంగానే పనిచేస్తూనే త మకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సం బంధాలు లేవని చెప్పుకునేవి. దీనిని నమ్మి తెలివిగల, చైతన్యమున్న విద్యార్థులందరూ తమకు నచ్చిన, అందుబాటులో ఉన్న, సంఘాలకు వివిధ కారణాలతో ఆకర్షితులై ఆయా విద్యార్థి సంఘాలలో అధికంగా చేరడం చేసేవారు.
అయితే ప్రధానంగా సిద్ధాంతపరమైన అవగాహన కలిగి, లోతైన విశ్లేషణతో, నిబద్ధత, నిజాయితీ కలిగి, ఆదర్శవంతులయిన నాయకులను అనుసరిస్తూ అటువంటి వాళ్లున్న సంఘాలలోనే చేరి నీతికి,- న్యాయానికి, విలువలకు, చదువుకు ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే కొన్ని పార్టీలు మాత్రం తమ స్వార్థం కోసం కళాశాలల్లో బ్యాక్ బెంచీల్లో కూర్చొనే విద్యార్థులను ఎంచుకొని వారిని గ్యాంగ్ లీడర్స్‌గా మార్చి, వాళ్లకు బయట నుంచి మద్దతివ్వడం జరుగుతుండేదని ఎక్కువగా వినిపించేది.
తద్వారా కళాశాలలు గ్యాంగ్ లీడర్స్‌ను తయారు చేసే కేంద్రాలుగా మారుతున్నాయనే భావన పెరిగిపోయింది. దీం తో ఈ కారణాల చేతనే అప్పటి ప్రభుత్వం కాలేజీల్లో ఎన్నికలు లేకుండా చేసిందనే వాదన కూడా ఉంది. కానీ ఎక్కువ మంది విద్యార్థులు వాటి గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇలాంటి విషయాలను పట్టించుకోని చాలా మంది విద్యార్థులు కేవలం ఉద్యోగాలను పొందడానికి మాత్రమే ప్రాధాన్యతనివ్వకుండా.. తమ కుటుంబ వెనుకబాటుతనాన్ని, గ్రామీణ నేపథ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, విద్యార్థి ఉద్యమాల్లో కూడా చురుకుగా పాలుపంచుకునేవారు.
అన్ని పదవులు వాళ్లకే!
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థి సంఘాల్లో పనిచేయడం ఆ కాలంలో బాధ్యతగా భావించేవారు. ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు కుల ప్రాతిపదికన మాత్రం విద్యార్థి సంఘాలు అసలు కనిపించేవి కావు. ఒకవేళ ఉన్నా అవి పెద్దగా పనిచేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రభుత్వ అధికా రులతో పాటు రాజకీయ నాయకులు కూడా కుల పరమైన విద్యార్థి సంఘాలను ప్రోత్సహించలేదు.
కానీ బీసీ విద్యార్థి సంఘం పేరు మీద హైదరాబాద్ నుంచి బీసీ హాస్టళ్లకు ఉత్తరాలు వచ్చేవి. వాటి మీద ఆర్. కృష్ణయ్య పేరు కనిపించేది. ఎప్పుడో ఒకసారి ఆర్ కృష్ణయ్య సహచరుడైన వకుళాభరణం కృష్ణమోహన్ వివిధ కళాశాలలకు, హాస్టళ్లకు వచ్చి బీసీ ఉద్యమ ఆవశ్యకతను వివరించేవారని బీసీ హాస్టళ్ల విద్యార్థులు పేర్కొన్నారు. అయితే అప్పుడున్న పార్టీలలో బీసీలకు సంబంధించిన ఏ విషయాలు చర్చకు రాకపోయేవి.
అందుకే విద్యార్థి సంఘాల్లోనూ బీసీ అంశాలు, సమస్యలపై ఏనాడు చర్చకు రాలేదన్న విషయం అవగతమవుతుంది. విద్యార్థులంతా ఒకటే అనే భావన కలిగి ఉన్నప్పటికీ వర్గ పోరాటాలకు మాత్రం ఆలోచించి ముందుకెళ్లేవారు. అలా కాదం టే అరాచక వాదానికి, ప్రభుత్వ వి ధానాలకు, అధికారయుత విధానానికి వ్యతిరే కంగా విద్యార్థి సంఘాలు పనిచేసేవి. ఆరోజుల్లో ప్రధానంగా స్కాలర్‌షిప్‌ల పెంపు దల, మెస్ ఛార్జీల పెంపుదల కోసం, కాస్మొటిక్ ఛార్జీల పెంపు కోసం ఉద్యమాలు ఎక్కువగా జరిగేవి.
ఇక మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆరోజుల్లో దాదాపు అన్ని విద్యార్థి సంఘాల్లో అగ్ర కుల వ్యక్తులు కొద్ది మందే ఉన్నా, నాయకులుగా ముఖ్యమైన పదవులన్నింటిలో అగ్ర కులాల విద్యార్థులే ఎక్కువగా ఉండేవారు. ఇప్పటికీ వామపక్ష, మితవాద, మధ్యేవాద సంఘాల్లోనూ వీరి ఆధిపత్యమే స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యాసకర్త సెల్: 9849867032