కేసీఆర్‌కు ఎదురుదెబ్బ
‘విద్యుత్తు’పై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకొన్న విద్యుత్ ఒప్పందాలు, చేపట్టిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చట్టబద్ధమేనని హైకోర్టు ప్రకటించింది. ఈఆర్సీకంటే ఈ కమిషన్ పరిధి పెద్దదని స్పష్టంచేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.
పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చి చెప్పింది. కేసీఆర్ తన పిటిషన్‌లో కమిషన్ చైర్మన్‌గా ఉన్న హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని వ్యక్తి గతంగా ప్రతివాదిగా చేర్చటంతో హైకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్‌కు నంబర్ కేటాయించేందుకు అభ్యంతరం తెలిపింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు డిస్మిస్ చేయటంతో పిటిషన్‌కు నంబర్ కేటా యించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలో లేదో అనే అంశంపై గత శుక్రవారం విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరిస్తూ సోమ వారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ పరిధి పెద్దది
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ 1952 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యవహారాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను గత మార్చి 14న నియమించింది. ఈ కమిషన్ ఏర్పాటును హైకోర్టులో సవాల్‌చేసిన కేసీఆర్.. విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ (ఈఆర్సీ)ల నిర్ణయాలపై విచారణ కమిషన్లు వేయటం చట్ట విరుద్ధమని వాదిం చారు. ఆయన వాదనను కోర్టు తోసి పుచ్చింది. ఈఆర్సీ పరిధి కంటే విచారణ కమిషన్ పరిధి పెద్దదని స్పష్టంచేసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై న్యాయపర వ్యవస్థలైన తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లు తేల్చిన అంశాలపై విచారించే పరిధి కమిషన్‌కు ఉన్నదని తేల్చి చెప్పింది.
కమిషన్ విధి విధానాలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నది. ‘కమిషన్‌కు విచారణ పరిధి లేదని కేసీఆర్ చేసిన వాదన చట్టబద్ధం కాదు. ఈఆర్సీలు తేల్చిన అంశాలు కమిషన్‌లో లేవు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంతో ఉన్నారని చెప్పడానికి ఆయన మీడియాతో మాట్లాడటం ఒక్కదాన్నే చూపుతున్నారు. మీడియాలో ప్రకటన తప్ప మరెలాంటి అభియోగాలు పిటిషనర్ చూపలేదు. పక్షపాతంగా కమిషన్ ఉందని చెప్పేందుకు కూడా ఆధారాలు చూపలేదు.
అంతా ఊహాజనితంగానే కేసీఆర్ అభియోగాలు చేశారు. ఆధారాలు చూపడంలో కేసీఆర్ విఫలమయ్యారు. విద్యుత్తు కొనుగోళ్లు, ఉత్పత్తి సంస్థల ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని భావించే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఎంక్వయిరీ కమిషన్ యాక్ట్ సెక్షన్ 8బీ ప్రకారం నోటీసు చెల్లదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకం. ఆ నోటీసుల అమలును నిలిపివేయడానికి ఆస్కారమే లేదు. నిబంధనలకు అనుగుణంగానే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. అందుకే కేసీఆర్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నాం’ అని ధర్మాసనం ప్రకటించింది.
నిజ నిర్ధారణే కమిషన్ బాధ్యత
విచారణ కమిషన్ల చట్టం1952 ప్రకారం ఏదైనా అంశంపై నిజనిర్ధారణ చేసేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసే అధికారం రాష్ట్రానికి ఉందని హైకోర్టు తెలిపింది. ఆ చట్ట ప్రకారం కమిషన్ సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించే అధికారం ఉందని తేల్చి చెప్పింది. వీటికి సంబంధించిన ఆఫీస్ ఫైళ్లను పరిశీలించే అధికారం కూడా కమిషన్‌కు ఉందని ప్రకటించింది. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ 1952 ప్రకారం నియమించే కమిషన్ సంబంధిత అంశంలో నిజ నిర్ధారణ మాత్రమే చేస్తుంది.
విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడమే కమిషన్ బాధ్యత. ఫలానా వాళ్లు తప్పు చేశారని ఎవరినీ బాధ్యులుగా తేల్చే అధికారం కమిషన్‌కు ఉండదు. ఎప్పుడైనా సున్నితమైన అంశాలపై సాధారణ దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగిస్తే పలు సందేహాలకు తావిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుళ ప్రయోజనాలున్న అంశాలపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే ప్రక్రియలో భాగంగానే కమిషన్ ఏర్పాటు ద్వారా వాస్తవ పరిస్థితులపై నివేదికలను ప్రభుత్వాలు తెప్పించుకుంటాయి. ఈ విషయాన్ని రామకృష్ణ దాల్మియా వర్సెస్ ఎస్‌ఆర్ టెండుల్కర్, కర్ణాటక వర్సెస్ కేంద్రం కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది’ అని ధర్మాసనం గుర్తుచేసింది.
ఈఆర్సీలే ఫైనల్ కాదు
విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం వంటివి విద్యుత్తు చట్టం పరిధిలో ఉన్నాయని.. ఆ చట్టం కింద ఉన్న ఈఆర్సీలు లైసెన్సులు పొందినవారి మధ్య వివాదాలు, ఉత్పత్తి కంపెనీల వివాదాలను మాత్రమే పరిష్కరిస్తాయని ధర్మాసనం పేర్కొన్నది. ఈఆర్సీల నిర్ణయంపై అప్పీలేట్ ట్రైబ్యునల్, ఆపైన సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని గుర్తుచేసింది. ‘మన ముందున్న వివాదం తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలు వంటి వాటిపై నిర్ణయాలకు సంబంధించినది. ఆ నిర్ణయాలు ఎలా జరిగాయి? చట్ట ప్రకారం వ్యవహారాలు ఉన్నాయో లేదో, కచ్చితత్వం ఉందో లేదో తేల్చేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది.
ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేశాక విద్యుత్తు యూనిట్‌కు రూ.3.90గా నిర్ణయిస్తూ 2017 మార్చి 31న ఉత్తర్వులిచ్చింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే విద్యుత్ కొనుగోలు చేయాలని తెలంగాణ డిస్కంలకు ఆదేశాలు వెళ్లాయి. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ 2018 జూలై 7న టారిఫ్ నిమిత్తం ప్రాజెక్టు ఖర్చును నిర్ధారిస్తూ ఆదేశాలను వెలువరించింది. దీనిపై తెలంగాణ డిస్కంలు అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినా కేసులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాజెక్టు ఖర్చు, టారిఫ్ నిర్ణయాలపై రెండు రాష్ట్రాల ఈఆర్సీలు విచారించాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ విధివిధానాలను పరిశీలిస్తే.. పీపీఏ, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో లోపాలు, వీటి ఫలితంగా ఆర్థికంగా పడే ప్రభావం.. వంటి వాస్తవ నివేదిక ఇవ్వాలని ఉంది. రెండు రాష్ట్రాల ఈఆర్సీలు తేల్చే అంశాల కంటే కమిషన్ తేల్చే పరిధి చాలా విస్తృతం. ఈఆర్సీల పరిధిలోని అంశాలు కమిషన్ విచారణ చేయాల్సిన వాటిలో లేవని విధివిధానాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ వ్యవహారం ఈఆర్సీలోనే తేల్చాలన్న పిటిషనర్ వాదనలో ఏమాత్రం చట్టబద్ధత లేదు. విచారణ పరిధి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు లేదనడం కూడా చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదన ఆమోదయోగ్యంగా ఉన్నది’ అని హైకోర్టు తెలిపింది.
పక్షపాతం ఎక్కడ?
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని పిటిషనర్ చెప్పడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘కమిషన్ ముందే ఒక నిర్ణయానికి వచ్చిందని, పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న పిటిషనర్ వాదనలకు ఆధారాల్లేవు. అసలు పక్షపాతం అనే పదానికి తగిన నిర్వచనమే లేదు. దీనిపై చట్టబద్ధంగా నిర్వచనం అందుబాటులో లేదు. ఉహాజనితంగా అభియోగాలు మోపి పక్షపాతం అంటే సరికాదు. ఆరోపణలకు సహేతుక ఆధారాలు ఉండాలి. దీనిని ఆర్థిక, వ్యక్తిగత, అధికారిక పక్షపాతం అని మూడుగా విభజించవచ్చు. నిర్ణయాలను వెలువరించడానికి అనుసరించిన విధానం ఆధారంగా పక్షపాతమో, కాదో చెప్పవచ్చు.
కేసీఆర్ నోటీసు జారీచేసినప్పుడు ఎన్నికల బిజీలో ఉన్నామని చెప్పి వాయిదా కోరి, ఆ తర్వాత విలేకరుల సమావేశాన్ని జస్టిస్ నరసింహారెడ్డి నిర్వహించారని చెప్పి కమిషన్ పక్షపాతమని అభియోగం మోపటం సమర్ధనీయం కాదు. జూన్ 11న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ స్థాయిని వెల్లడించే క్రమంలోనే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇది కమిషన్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతుందో వెల్లడించడం కాదు. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి పక్షపాతంతో ఉందనడమూ సరికాదు. జస్టిస్ నరసింహారెడ్డి గతంలో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగ విధులు నిర్వహించారు. ఈ విషయాన్ని ఏ పక్షమూ కాదనలేదు. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తారనే ఊహాజనిత అభియోగాలతో కోర్టుకు వచ్చారు’ అని కోర్టు అసహనం వ్యక్తంచేసింది.
నోటీసులు చట్టబద్ధమే
కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేటం చట్టబద్ధమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. కమిషన్ ఫైళ్లను పరిశీలించాక విద్యుత్ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రధాన భూమిక పోషించారనే ఆధారాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిందని తెలిపింది. ఆ తర్వాతే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందని పేర్కొన్నది. ‘కమిషన్ విచారణ పూర్తిగా చట్టబద్ధం. కాబట్టి కేసీఆర్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలన్న విన్నపాన్ని అభ్యర్థన దశలోనే కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం ప్రకటించింది.






