18 July, 2026 | 7:46 AM

మోదీ వర్సెస్ రాహుల్

02-07-2024 02:24 AM

  • లోక్‌సభలో వాడీవేడీ వాదనలు
  • నీట్‌పై చర్చకు విపక్షాల డిమాండ్
  • రాహుల్‌గాంధీ శివుడి ఫొటో ప్రదర్శన 
  • లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేసిన మోదీ
    • క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్

న్యూఢిల్లీ, జూలై 1: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీక్‌పై చర్చకు ఒకరోజు ప్రత్యేకంగా సెషన్ నిర్వహించాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందుకు తిరస్కరించడంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ తన తొలి ప్రసంగంలోనే అధికార పక్షానికి దడ పుట్టించారు. శివుడి ఫోటోను ప్రదర్శించడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 

మోదీ ఎప్పటికీ హిందు కాలేరు

రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి మాట్లాడుతూ.. నీట్‌పై సభలో తప్పకుండా చర్చించాలి. భారత రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. ప్రతిపక్ష నాయకులపైనా దాడులు చేస్తున్నారు. విపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్నారు. కొందరు ఇంకా జైలులో ఉన్నారు. శివుడి ఎడమ చేతి వెనుక త్రిశూలం ఉంటుంది. ఒకవేళ త్రిశూలం హింసను ప్రోత్సహిస్తే అది శివుడి కుడి చేతిలో ఉండేది. హిందూ సమాజం అంటే మోదీ ఒక్కరే కాదు. హిందుత్వ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదు. కానీ, మోదీ నేతృత్వంలోని బీజేపీ 24 గంటలను హింసకు పాల్పడుతోంది. మీరు ఎప్పుడూ హిందువులు కాలేరు అంటూ రాహుల్ వివిధ మతాలకు చెందిన ఫొటోలను ప్రదర్శించారు.

రాహుల్ మాట్లాడుతు అండగానే ప్రధాని మోదీ రెండుసార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభ వేదికగా హిందువులు హింసావాదులన్నట్టు మాట్లాడారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులపై దాడి అని మోదీ అభివర్ణించారు. ఆయన నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేత పదవిని గౌరవించడం రాజ్యాంగం తనకు నేర్పిందని ప్రధాని ప్రకటించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి అహింస గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. 

రాహుల్ వర్సెస్ స్పీకర్ 

లోక్‌సభలో తన మైక్ మళ్లీ కట్ చేశారని రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసలు మైకులు ఎవరి నియంత్రణలో ఉం టాయని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ వ్యవహార శైలినీ రాహుల్ తప్పుబట్టారు. మోదీ షేక్‌హ్యాండ్ ఇస్తే తలవంచారని, తాను ఇచ్చినప్పుడు నిటారుగా నిలుచున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన స్పీకర్.. మోదీ తనకంటే వయసులో పెద్దవారు కాబట్టే అలా చేశానని వివరణ ఇచ్చారు. 

ద్వివేది, త్రివేదిలతో కన్ఫ్యూజన్.. 

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఖర్గే మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్‌తో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఖర్గే తన చమత్కారమైన మాటలతో సభలో నవ్వులు పూయించారు. ఈ మాటల మధ్యలోనే బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ప్రస్తావన తీసుకొచ్చారు ఖర్గే. నేను ద్వివేది, త్రివేది, చతుర్వేది పేర్లతో అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటా అని తెలిపారు. దానికి చైర్మన్ జగ్‌దీప్ బదులిస్తూ దీనిపై మీరు కోరితే ఒక అరగంట చర్చ పెట్టుకుందాం అని అన్నారు.