18 July, 2026 | 7:07 AM

ఆలయాలు వ్యాపార కేంద్రాలు కావు

02-07-2024 02:43 AM
  • అధికారుల తీరుపై హైకోర్టు మండిపాటు

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): అలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారని దేవాదాయ, ధర్మాదాయ శాఖపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాబడికి మించి ఖర్చులు ఉన్నప్పుడు ఆ లోటును ప్రభుత్వాలు భర్తీ చేయాలని స్పష్టం చేసింది. హుండీ ఆదాయం, కానుకలు, విరాళాలతో ఆలయాలను నిర్వహించే సంప్రదాయం ఉందని, వీటి ఆదాయాలను పెంచుకునేలా చేయాలంది. ఇందుకోసం అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో కొవిడ్ కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్సు కాలాన్ని 5 నెలలపాటు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

లైసెన్సు గడువు పెంచాలని పలువురు వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు హక్కులు ఉన్నాయని, అయితే కొవిడ్ కారణంగా దుకాణాలను మూసివేయడంతో 292 రోజులు పొడిగిస్తూ 2021 డిసెంబరు 17న ప్రభుత్వం మెమో జారీ చేసిందని, దీన్ని అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారన్నారు.

దీనికి విరుద్ధంగా ఈవో టెండరు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్లకు ఇచ్చిన గడువు కంటే అదనంగా కొనసాగించినట్లు తెలిపారు. 2023 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 దాకా లైసెన్సు పొడిగించామని, మళ్లీ పొడిగించాలనే కోరే హక్కు లేదన్నారు. 2020 జూన్ నుంచి అక్టోబరు 30 దాకా ఆలయం తెరిచే ఉందని, టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన మెమోను పరిశీలించాలన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత 5 నెలలపాటు లైసెన్సును పొడిగించాలని మహంకాళి ఆలయ ఈవోను ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.