భూసమస్యకు పరిష్కారం చూపాలి... కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన
జనగామ, మే 23 (విజయక్రాంతి): భూ మి విషయమై న్యాయం పోరాటం చేస్తుంటే కొందరు చంపుతామని బెదిరిస్తున్నారని, భూమిని వదులుకోవాలని సాక్షాత్తు తహసీల్దార్ కూడా సూచిస్తున్నారని చిలుపూరు మండల కేంద్రానికి చెందిన బోళ్ల రాజ్‌కుమార్ అనే రైతు గురువారం జనగామలోని కలెక్టరేట్ ఎదుట పురుగు మందు డబ్బా చేతిలో పట్టుకుని బంధువులతో కలిసి ఆం దోళన చేపట్టాడు. మీడియాకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. తమకు సంబంధించిన భూమి వేరొకరి పేరుపై మారిపోయిందని, ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరో పించాడు. న్యాయం చేయాలని మూడు రోజుల క్రితం చిలుపూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తే, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత భూమిని వదులుకోవాలని రెవెన్యూ అధికారులే బెదిరిస్తున్నారని వాపోయాడు. ఓ పార్టీ నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నదని, తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.






