07-01-2026 12:00:00 AM
పాపన్నపేట, జనవరి 6 (విజయక్రాంతి): కన్న తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం. గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య (48) వ్యవసాయంతోపాటు ఓ లైన్ మెన్ వద్ద విద్యుత్ పనుల కోసం ప్రైవేటు సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య శేఖమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద పెద్దలు కొడుకు శ్రీకాంత్ వివాహానికి, వ్యవసాయానికి కొంత అప్పులు వచ్చినట్లు అయ్యాయి.
పెద్ద కొడుకు శ్రీకాంత్ కు, లక్ష్మయ్యకు తరచూ డబ్బుల విషయంలో గొడవలు జరిగేవి. డబ్బులు ఇవ్వకపోతే చంపుతా అంటూ తరచూ శ్రీకాంత్ తండ్రిని బెదిరించేవాడు. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే శ్రీకాంత్ మళ్లీ డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శ్రీకాంత్ ఆవేశంలో ముందుగా సుత్తేతో తండ్రిపై దాడి చేయగా తల్లి శేఖమ్మ అతని వద్ద నుంచి సుత్తిని హాలాక్కోవడంతో శ్రీకాంత్ మళ్లీ అక్కడే ఉన్న కర్రతో లక్ష్మయ్య తలపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది.
వెంటనే కుటుంబీకులు మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ ఏర్పాటు చేసిన వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. తన భర్త మృతికి కారణమైన కొడుకు శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య భార్య శేఖమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.