ఓపీఎస్‌పై స్పెషల్ లీవ్ పిటిషనా?
ఖండించిన పీఆర్టీయూ టీఎస్ సంఘం
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికినీ ప్రభుత్వం మళ్లీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం హేయమైన చర్య అని పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, భిక్షంగౌడ్ శనివారం ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
01-09-2004కు ముందు నోటిఫికేషన్ జారీ చేసి అనంతరం నియామకాలు పొందిన ఉద్యోగులకు ఓపీఎస్ విధానం వర్తింపచేయాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకొని అమలు చేస్తోందన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉద్యోగుల జేఏసీ జరిగిన చర్చల్లో కూడా ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొన్నారు.






