తండ్రీకొడుకుల దుర్మరణం
- దూడను కాపాడబోయి బావిలో పడటంతో ప్రమాదం
- ములుగు జిల్లా కర్లపల్లిలో దుర్ఘటన
- తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మంత్రి సీతక్క
మహబూబాబాద్, మే 9 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడ్డ లేగ దూడను కాపాడబోయి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రసపుత్ రాజు, ఆయన కుమారుడు పవన్ తమ కళ్లెదుటే లేగ దూడ బావిలో పడిపోవడం గమనించారు. మూగజీవిని కాపాడేందుకు వారు 35 అడుగుల లోతు ఉన్న బావిలోకి దిగి, తిరిగి తాడు సహాయంతో పైకి ఎక్కుతున్న నేపథ్యంలో తాడు తెగిపోయి తండ్రి కొడుకులు బావిలో పడిపోయి నీట మునిగి, ఊపిరాడక దుర్మరణం పాలయ్యారు. దీంతోగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో తీరని శోకాన్ని కలిగించింది.
సంఘటన తెలుసుకున్న సీఐ దయాకర్ పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనస్థలికి చేరుకొని మృతదేహాలను బావిలో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.






