05-01-2026 12:10:10 AM
ఆసక్తి చూపని యువత లక్ష్యం ఘనం... ఆచరణ శూన్యం
శామీర్‌పేట్, జనవరి 4 (విజయ క్రాంతి): గత ప్రభుత్వ హయాంలో అప్పటి గ్రామాల (ప్రస్తుత మున్సిపాలిటీ ) లో క్రీడాకారులు, యువత, విద్యార్థుల్లో క్రీడలు, వ్యాయామం పట్ల ఆసక్తిని పెంచేందుకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా క్రీడా ప్రాంగ ణాలు నిరుపయోగ మవుతూ నిర్లక్ష్యం నీడలో, కొట్టుమిట్టాడుతున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ క్రీడా ప్రాంగణం బోర్డులకే పరిమితమై అలంకార ప్రాయంగా మారింది .
ఒక్కో క్రీడా ప్రాంగణానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ. లక్షల వెచ్చించి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. స్థలాన్ని ఎంపికచేసి ఆటలకు అనువుగా ఉండే విధంగా చదును చేసి, చుట్టూ కంచె ఏర్పాటుచేసి నేమ్ బోర్డును ఏర్పాటు చేయాలి. చక్కటి ఆహ్లాదకర మైన వాతావరణం ఉండేలా చెట్లను నాటించాలి.
వ్యాయామం కోసం సింగిల్ బార్, డబుల్ బార్ లను, ఆటల కోసం ఖోఖో పోల్, లాంగ్ జంప్, హై జంప్ వంటి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ప్రణాళిక వేసి క్రీడా ప్రాంగణాలు నిర్మించింది. కానీ అలాంటివి ఏమీ లేకపోగా క్రీడా ప్రాంగణం ఉంది అనే విషయమే చాలామందికి తెలియని పరిస్థితి ఏర్పడింది. కేవలం నేమ్ బోర్డు పెట్టి చేతులు అధికారులు దులుపుకున్నారని క్రీడాకారులు ఆరోపణలు చేస్తున్నారు.
చిత్తశుద్ధి ఏదీ..?
యువత, విద్యార్థులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడల పట్ల దృష్టి సారించి ఖాళీ సమయంలో ఆటలు ఆడుకునే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా మైదానాలు ఆచరణలో చిత్తశుద్ధి కనిపించక పోవడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఊరికి దూరంగా, అనుకూలంగా లేని చోట కేవలం నేమ్ బోర్డులు పెట్టి నామమాత్రపు పనులు చేసి వదిలే యడం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టిన క్రీడా మైదానాలు చెత్తా, చెదారం, పిచ్చి మొక్కలతో నిండి ఉన్నాయి. పత్రికల్లో ప్రచురించి నప్పుడు మాత్రం రెండు మూడు రోజులు హడావిడి చేసి మళ్లీ అటువైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు .ఈ ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఎవరు ఆసక్తిని చూపడం లేదు. ఇప్పటికైనా క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని యువత, మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.