18 July, 2026 | 6:22 AM

ఇండ్ల నిర్మాణంపై అధ్యయనం

02-07-2024 03:52 AM
  • మూడు నగరాలకు బృందాలు
  • ఇందిరమ్మ ఇండ్లకు సోలార్ తప్పనిసరి
  • ఓఆర్‌ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య నిర్మాణంపై దృష్టి
  • అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ర్టంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. 

సచివాలయం లోని ఆయన కార్యాలయంలో రెవెన్యూ మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి హౌసిం గ్, రెవెన్యూ, ఐ&పీఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీని  ప్రభుత్వం ప్రోత్సహిస్తు న్నందున ఇండ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుందన్నారు.  సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఔటర్, ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. 

మూడు నగరాల్లో అధ్యయనం

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత హౌసింగ్ శాఖపై ఉందని భట్టి గుర్తుచేశారు. ఎస్‌ఆర్ నగర్, బర్కత్‌పుర, కూకట్‌పల్లి, ఈసీఐఎల్ లాంటి ప్రాంతా ల్లో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ పేరిట ఇండ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. చెన్ను, బెంగళూర్, ముంబై నగరాలకు అధికారులు వెళ్లి అక్కడి ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల అర్హత, ఎంపిక విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని భట్టికి తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు, ఇప్పటివరకు నిర్మాణమైనవి, ఇంకా పూర్తి కావాల్సినవాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇందిరమ్మ రాజ్య లక్ష్యమదే..

గ్రేటర్ పరిధిలో గత ప్రభుత్వం లక్ష ఇం డ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని 69 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసి వాటిని పంపిణీ చేసిందని అధికారులు వివరించారు. మిగతావాటి నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అలాగే ధరణి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. డిజిటల్ భూ సర్వే చేయడానికి నిధులను ఇవ్వాలని అధికారులు భట్టిని కోరారు. సంపద సృష్టించి దాన్ని రాష్ర్ట ప్రజలకు పంచేందుకు అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సమీకరించాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.