డాటా, క్లౌడ్ రంగాల్లో హైదరాబాద్ టాప్
- మైక్రోసాఫ్ట్ విస్తరణ పనులు పూర్తయితే సాధ్యం
- త్వరగా కంప్లీట్ చేయాలన్న మంత్రి శ్రీధర్‌బాబు
- మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాదికి పూర్తి చేసి కార్యకలాపాలను పెంచాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. విస్తరణ పనులు పూర్తయితే అత్యాధునిక డాటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందని వెల్లడించారు. డాటా సెంటర్ల పను లు దాదాపు 70 శాతం పూర్తయ్యాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
ఈ సెంటర్లకు సంబంధించిన భూస మస్యల పరిష్కారం, మౌలిక వసతులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి సోమవారం సమీక్షించారు. డాటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకను మంత్రి ఆదేశించారు. ఆ భూమిలో విద్యుత్తు సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు,
వరద నీటి కాలువల నిర్మాణం లాంటి పనులు గడువులోగా పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిధులకు శ్రీధర్‌బాబు తెలిపారు. సంస్థ సేకరించిన భూముల వినియోగ మార్పిడి పను లు వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.
మైక్రోసాఫ్ట్ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందన్‌వల్లెలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది. ప్రభుత్వం తరఫు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణ కోసం ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో మైక్రోసాఫ్ట్ ఆసియా ఆపరేషన్స్ హెడ్ ఇయాన్ కొలన్, భూఅభివృద్ధి విభాగం హెడ్ ఉత్తమ్‌గుప్తా, ఇండియా కమ్యూనిటీ హెడ్ శ్రీచందన తదితరులు పాల్గొన్నారు.






