18 July, 2026 | 6:38 AM

అంతస్థుల కన్నా వైద్యం ముఖ్యం

02-07-2024 03:42 AM
  • సేవలు సకాలంలో అందాలి
  • జూడాల సమస్యలు 95 శాతం పరిష్కరించాం
  • త్వరలో రెగ్యులర్ హెచ్‌వోడీలను నియమిస్తాం
  • నీట్ నిర్వహణపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలి
  • డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): ఎన్ని అంతస్థులు కట్టామన్నది విషయం కాదని, పేదలకు మెరుగైన వైద్యం అందించడం ముఖ్యమని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉద్ఘాటించారు. 24 అంతస్థుల్లో నిర్మిస్తున్న 4 టిమ్స్ ఆస్పత్రులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనల మేరకు 13 అంతస్తులకు మించి ఎత్తున భవనాలు అవసరం లేదంటూ గత ప్రభుత్వం తీరును మంత్రి విమర్శించారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని తమ నివాసంలో మాట్లాడుతూ.. వైద్యులకు ఆయన డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 95 శాతం పరిష్కరించామన్నారు.

పది రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ వసతి గృహాల భవనాలకు, కేఎంసీలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. వైద్య సేవల్లో మౌలిక సదుపాయాలతో పాటు హెచ్‌ఆర్ విధానం ముఖ్యమని, ప్రస్తుతం హెచ్‌ఆర్ అసమగ్రంగా ఉందని, దాన్ని సరిచేస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. రోగి ఎన్ని నిమిషాల్లో హాస్పిటల్‌కు వెళ్లగలుగుతున్నారు, అక్కడి నుంచి  పెద్దాసుపత్రికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందనే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. నీలోఫర్, ఎమ్‌ఎన్‌జే స్పెషాలిటీ వైద్యానికి ప్రత్యేకత సంతరించుకున్నాయని, అలాగే మిగతా వాటిని తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే హెచ్‌వోడీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. నీట్ రద్దు చేయాలా? కేంద్రం నిర్వహించాలా? రాష్ట్రాలకు ఇవ్వాలా? అనే అంశంపై చర్చ జరగాల్సి ఉందన్నారు.