నిమ్స్‌లో మెదడు కణితి ఆపరేషన్ సక్సెస్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): మెదడులో సంక్లిష్టమైన కణితి కారణంగా తీవ్రంగా బాధపడుతున్న ఓ యువకుడికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితి భాగాన్ని తొల గించారు. సంగారెడ్డికి నరహరి (35) అనే వ్యక్తి తీవ్రమైన తలనొప్పి, వాంతులతో ఇబ్బందులకు గురవుతూ నిమ్స్ వైద్యులను సంప్రదించాడు. ఎంఆర్‌ఐ, సీటీ స్కానింగ్ చేయగా మెదడు భాగాన అత్యంత ముఖ్య మైన రక్తనాళాల మధ్యలో కణితి ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు.
ఈ కణితి తీవ్రతను గుర్తించి ఆపరేషన్‌కు అవసరమైన 3డీ వెనో గ్రామ్ పరీక్ష ద్వారా ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ చేశారు. అయితే, క్రానియోటమీ అండ్ ఆక్సి పిటల్ ట్రాన్స్‌స్టెనోరియల్ అప్రోచ్ పద్ధతిలో గతవారం డాక్టర్ తిరుమల్, ఇతర వైద్య బృందం ఆపరేషన్ చేయగా పేషెంట్ పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు శుక్రవారం తెలియజేశాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న డాక్టర్ తిరుమల్, డాక్టర్ నితిన్, డాక్టర్ విశాల్, డాక్టర్ దీపక్, డాక్టర్ వంశీ కృష్ణ, అనస్తీషియా, రేడియోలాజీ విభాగా లకు ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సుచంద అభినం దనలు తెలియజేశారు.






