కనుమరుగైన ఉద్యమ చిహ్నం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సిద్దిపేట త్యాగం చరిత్రలో చెరగలేనిది. కాని ఇక్కడ నిర్మించిన ఉద్యమ స్మృతి చిహ్నం మాత్రం కనుమరుగైంది. నిర్మించిన వారే నేలకూల్చారు. పునఃనిర్మాణానికి కనీసం పూనాది కూడా వేయలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన సిద్దిపేటలో పాత బస్టాండ్‌ను అనుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వెనకాల దీక్షలు చెపట్టారు. ఇప్పటికి ఈ స్థలాన్ని దీక్ష శిబిరంగా పిలుస్తారు.
1531 రోజులు సాగిన దీక్షలలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. అందుకు గుర్తుగా తెలంగాణ ఉద్యమ స్మృతి చిహ్నన్నినిర్మించారు. 2015 జూలై నాలుగోవ తేదిన మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పాత బస్టాండ్ నిర్మాణంలో భాగంగా కూల్చేశారు. తర్వాత మళ్లీ నిర్మించలేదు. పైలాన్ పునఃనిర్మాణం చేపట్టాలనే డిమాండ్ ఉన్నప్పటికి పాలకులు పట్టించుకోలేదు. పైలాన్ పునఃనిర్మించకపొవడానికి కారణాలేమైన ప్రస్తుతం పైలాన్ కనుమరుగైందని చెప్పవచ్చు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ పలు రకాల ఉద్యమాలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా ప్రజా స్వామ్యబద్దంగా ఆందోళనలు నిర్వహించాలని ప్రజలను కోరారు. ఫలితంగా వివిధ వర్గాల వారు తమకు తోచిన రీతిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ కార్యచరణలో సిద్దిపేట ముందు నిలిచింది. చంద్రశేఖర్‌రావుకు రాజకీయ గుర్తింపు నిచ్చిన సిద్దిపేట మలి తెలంగాణ ఉద్యమంలో కూడా ముందు నిలిచింది. తెలంగాణ ఉద్యమకారులు అనేక ఆందోళనలు చేపట్టిన తరుణంలో సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద 2009 డిసెంబర్ 24న రిలే నిరహార దీక్షలు చేపట్టారు.
దీక్షలలో కుల, మతాలకు అతీతంగా రైతులు, యువజనులు, ఉద్యోగ ఉపాద్యాయులు, మహిళలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. దీక్షలు 50వ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్ష 60 రోజులకు చేరిన తర్యాత అనివార్య కారణాల వల్ల మూత పడింది. రిలే నిరహార దీక్ష శిబిరం లేక పోవడం వల్ల ఏర్పడిన లోటును గమనించిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు , తెలంగాణ జేఎసి నాయకులు 15 రోజుల్లో పునరుద్దరించారు. దీక్ష 100వ రోజు ప్రత్యేక సభలో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ హరగోపాల్, అప్పటి టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు స్వామిగౌడ్, దేవీప్రసాద్‌లు పాల్గొన్నారు. దీక్ష 150వ రోజు సందర్భంగా తెలంగాణ అమర వీరుల కుటుంబ సభ్యులకు 25 వేల రూపాయల చొప్పున ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆర్థిక సహాయం అందజేశారు.
అప్పటి మెదక్ ఎంపీ విజయ శాంతి, జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు ఆ సభలో పాల్గొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్, జనశక్తి నేత కూరరాజన్న, అమర్, విమలక్క, దిలీప్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు శిబిరాన్ని సందర్శించారు. 2010 ఆగస్టు 25వ తేది శ్రీ కృష్ణ కమిటీ సిద్దిపేట మండలం చిన్న గుండవెల్లికి వచ్చింది. దీక్ష శిబిరాన్ని సందర్శించి అక్కడున్న వారి ఆభిప్రాయాలను సేకరించారు.
పండగ పబ్బం తేడా లేకుండా ..
పండుగ పబ్బం అనే తేడా లేకుండా మహా శివరాత్రి, దసరా, ఉగాది తదితర పండుగలను ఉద్యమకారులు దీక్షా శిబిరం వద్దే జరుపుకున్నారు. దేశపతి శ్రీనివాస్, మధుప్రియ, దరువు అంజన్న, విమలక్క, సాయికుమార్, రసమయి బాలకిషన్, తదితర గాయకులెందరో ఈ వేదిక నుంచి తమ గానాన్ని వినిపించారు. కరీంనగర్‌లో జరిగిన తెలంగాణ జన గర్జన సభ మర్నాడు కేసీఆర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి ప్రజలకు ఉద్యమ సందేశాన్ని అందించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవశ్యకతను చాటి చెప్పారు.
నీళ్లు, నిధులు నియమకాల విషయాలలో జరుగుతున్న దోపిడీని వివరించారు. అప్పటి శాసన సభ టీఆర్‌ఎస్ ప్లోర్ లీడర్ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ చుక్కారామయ్య తదితరులు ఎందరో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. 1,531 రోజుల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో దీక్ష శిబిరం మూతపడింది. ఈ దీక్షలకు గుర్తుగా పాత బస్టాండ్ వద్ద ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించారు. పాత బస్టాండ్ ఆధునీకరణ సందర్భంగా ఈ పైలాన్ కనుమరుగైంది.
మంద జనార్ధన్, సిద్దిపేట విజయకాంత్రి






