24 August, 2026 | 6:37 AM

ఆగమాగమైన బతుకులు!

13-06-2024 02:30 AM

నిప్పురవ్వ మీద పడితేనే మనం తట్టుకోలేం. చర్మం చిన్నగా కమిలిపోతేనే బొబ్బలెక్కి బబ్బొలు పెడుతుంటాం. అలాంటిది మంటలను ఒంటికి గంధంలా పూసుకున్నారు. తెలంగాణ తల్లి ఆత్మ గౌరవం కోసం ఆహుతయ్యారు. ఆ  మంటల్లో కాలి అగ్ని జ్వాలలా మారి వారి ఆకాంక్షలను చాటిచెప్పారు. రైలుకు ఎదురు వెళ్లి.. చెట్టుకు వేలాడి ప్రాణాలు విడిచారు. నెత్తుటితో ఎవరూ లేఖలు రాయరు.. కానీ ఆ యువకులు తెలంగాణ కొరకు తమ రక్తాన్ని సిరాగా మార్చి లేఖలు రాసి గాథగా మిగిలారు. వాళ్ల త్యాగం గొప్పది. తాము కలలు కన్న తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వారి త్యాగం వీరులతో సమానం.

తెలంగాణ కోసం కాలం ఆగి కన్నీళ్లు రాల్చింది. వారి త్యాగానికి భూమి అందమైన మోదుగు పూలను, ఆనందంతో దోసిలి  పట్టింది. వాళ్ల లక్ష్యం పవిత్రమైందంటారు ఓ కవి. మలిదశ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర సాధన కోసం ఒక్క జనగామ జిల్లా నుంచి ‘జై తెలంగాణ’.. ‘జై జై తెలంగాణ’.. అంటూ గొంతులు పిక్కటిల్లేల అరిచి 20 మంది ఉద్యమకారులు వీరమరణం పొందారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచిన అమరుల ఆశలు.. ఆకాంక్షలు మిగిలే ఉన్నాయి. అమరవీరుల కుటుంబాల్లో వాళ్లులేని వెలితి కనిపిస్తునే ఉన్నది. ఉద్యమ సమయంలో ఆగమైన అమరవీరుల కుటుంబాలను ‘విజయకాంత్రి’ పలకరించింది.       

అరాచకత్వం, అణిచివేత, పెత్తందారీ వ్యవస్థ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతం జనగామ. పోరాటాల గడ్డగా, చైతన్యవంతమైన ప్రజల అడ్డాగా ఈ ప్రాంతానికి పేరుంది. జనగామ తాలూకా పల్లెల్లో నాడు నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఎన్నటికీ మరువలేం. సామాన్య ప్రజలే బందూకులు చేతబట్టి, ఒడిసెలు, రాళ్లను ఆయుధాలు చేసుకుని రజాకార్లను తరిమిన తీరు ఇక్కడి ప్రజల పోరాట పటిమకు నిదర్శనం. దొరల గుండెలను అదరగొట్టిన చాకలి ఐలమ్మ, దొరల తూటాకు గుండెను అడ్డుపెట్టిన దొడ్డి కొమురయ్య వంటి యోధులను కన్న నేల ఇది.

అదే పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జనగామ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలోనూ జనగామ కీలక పాత్ర పోషించింది. స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన అన్ని పోరాటాల్లో ముందున్నది. 2001 తరువాత మొదలైన తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ పోరాట పటిమను చూపింది. సాయుధ పోరాటాన్నే స్ఫూర్తిగా తీసుకున్న ఇక్కడి ప్రజలు తెలంగాణ మలి దశ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 2009లో మలి దశ ఉద్యమం ఉధృత స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపుల మేరకు జరిగిన ప్రతీ కార్యక్రమంలో జనగామ ప్రజలు చురుకుగా పాల్గొని విజయవంతం చేశారు.

ఆ సమయంలో పారా మిలటరీ బలగాల వలయాన్ని సైతం లెక్క చేయక ఎన్నో ఆందోళనలు చేశారు. నిత్యం పాలకుల ఇంటి ముట్టడిలు, చౌరస్తాల అష్టదిగ్బంధనం, రాస్తారోకోలతో జనగామ పట్టణంతో పాటు పల్లెలన్నీ ఉద్యమ ఉప్పెనను తలపించాయి. ఆ రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై జనగామ ఆర్టీసీ చౌరస్తాలో రాళ్ల వర్షం కురిపించిన సంఘటన సంచలనం. ఇనుప కంచెలను లెక్కచేయక అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించిన సంఘటన ఉద్యమకారుల ధైర్యానికి నిదర్శనంగా నిలిచింది. 

సకల జనులు ఒక్కటై జనగామలో జరిగిన తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎందరో ఉద్యమకారులు తమ ప్రాణాలను వదిలారు. దేహానికి అగ్గి అంటించుకుని నిప్పురవ్వలై నినదించారు. కాలుతున్న దేహం నుంచి వచ్చిన ‘జై తెలంగాణ’ నినాదం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. జనగామ జిల్లాలో సుమారు 20 వరకు ఉద్యమకారులు తమ ప్రాణాలు అర్పించారు. ఇందులో ఎక్కువ మంది అగ్గికి ఆహుతైన వారే. అమరుల త్యాగం వల్లే నేడు తెలంగాణ ఏర్పడ్డది. అమరుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆదుకున్నప్పటికీ ఆ కుటుంబాల్లో కన్నీటి తడి ఇంకా ఆరలేదు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారు కొందరైతే.. చేతికొచ్చిన కొడుకు దూరమైన తల్లిదండ్రులు మరికొందరు. వీరికి ప్రభుత్వం అనేక హామీలిచ్చి కొంతవరకు నెరవేర్చగా.. మరికొన్ని హామీలు ఇంకా మిగిలే ఉంది.

20 మంది అమరులు.. 

అమరుల త్యాగం ఫలితంగానే తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైందనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని అన్ని పార్టీలతో పాటు పాలకులు అంగీకరించారు. తెలంగాణ కోసం సుమారు 1400 మంది అమరులయ్యారని ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీలు చెప్పాయి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ 800 లోపు మాత్రమే ఉద్యమకారులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తించింది. మొదటి విడతలో 2014 అక్టోబర్‌లో జీవో 35 విడుదల చేసి 459 మందిని అమరులుగా గుర్తించారు. ఆ తరువాత మరో 300 మందిని గుర్తించారు.

జనగామ జిల్లాలో మొదటి విడతలో తొమ్మిది మందిని అమరులుగా గుర్తించగా.. ఆ తరువాత మరో ఎనిమిది, తొమ్మిది మంది అమరులను గుర్తించినట్లు తెలిసింది. అమరుల జాబితా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. గుర్తించిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించారు. కానీ గృహ వసతి, మూడెకరాల భూమి, పింఛన్ వంటి హామీలు నెరవేర్చలేదని అమరుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. మిగతా హామీలు కూడా అమలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

అగ్గి రగిల్చిన అమరులు..

తెలంగాణ పోరులో అగ్గికి ఆహుతై అమరులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన గడప నర్సయ్య, రఘునాథపల్లి మండలం వీఆర్ తండాకు చెందిన భోజ్యానాయక్, లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్, జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామానికి చెందిన దేవర సారంగపాణి తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు.