24 August, 2026 | 7:59 AM

1969 ఓ అద్భుత పోరాటం!

13-06-2024 02:30 AM

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో  నల్లగొండ జిల్లాది పోరుబాటే.. ఉద్యమం తొలినాళ్లలో నాటి యువత ముందుండి పోరాడింది. అధికారుల సహకారం చాలా తక్కువ.. మరోవైపు పోలీస్ నిర్బంధాలు అధికం.. ఆ దశలో తెలంగాణ ఉద్యమాన్ని  విద్యార్థులు ప్రధాన భూమిక పోషించారు. విద్యార్థులే నాయకత్వం వహించి ఉద్యమాన్ని నడిపించేది. 1969, 1970 ఉద్యమ సమయంలో రెండు విద్యా సంవత్సరాలను కూడా చాలామంది విద్యార్థులు నష్టపోయారు. పరీక్షలు గైర్హాజరై ఉద్యమానికి ఊతమిచ్చారు. 

ప్రజా రవాణా సౌకర్యాలు చాలా తక్కువగా ఉండేది. మరోవైపు ప్రచారమాధ్యమాలు, మీడియా చాలా తక్కువగానే ఉండేది. ఇలాంటి అవంతరాల మధ్య కూడా 1969 తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. యువత ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదుట  మొహరించి అధికారులు కార్యాలయాలకు వెళ్లకుండా విద్యార్థులతో నింపేవారు. అధికారుల విధులను పూర్తిగా అడ్డుకునేవారు. ఇటువంటి పోరాటం ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యాప్తంగా జరిగింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సఢక్ బంద్, వంటావార్పు, సకల జనుల సమ్మె ఇలా విస్తృత రూపంగా ఉంటే.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్రే ప్రధానంగా ఉండేది.

ముల్కీ నిబంధనలను పాటించాలని, నాన్ ముల్కీ గో బ్యాక్ అంటూ ఉద్యమం సాగింది. నిర్మొహమాటంగా బహిష్కరణ, వారు చేసే సాగు ఇతర వృత్తులకు సహకరించకుండా ఉద్యమించేవారు.  అంతేకాకుండా వారిని మీ ప్రాంతాలకు వెళ్లవలసిందిగా ప్రాధేయపడేవారు. వినని వారికి సహకరించని వారికి ఆటంకాలు కలిగించేవారు. ఉద్యోగ సహాయ నిరాకరణ కూడా సాగింది. ఆంధ్రకు చెందిన పలువురు ఉద్యోగుల్ని బలవంతంగా ఇక్కడ నుంచి పంపించేవారు. ఇలా ఎన్నో రూపాలుగా తెలంగాణ తొలి దిశ ఉద్యమం సాగింది. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో మిర్యాలగూడ , హుజూర్ నగర్,  సూర్యాపేట, తాలూకా కేంద్రాల్లో పెద్ద ఎత్తున తెలంగాణ తొలి ఉద్యమం ఉవ్వెత్తున సాగింది.

ఒక విధంగా మిర్యాలగూడ కేంద్రంగానే తెలంగాణ తొలి ఉద్యమం నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యమానికి ఆనాడు మిర్యాలగూడకు చెందిన తిప్పన కృష్ణారెడ్డి నాయకత్వం వహించారు. కృష్ణారెడ్డి సాగించిన తెలంగాణ ఉద్యమాన్ని  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సభలలో  చెప్పారు. తిప్పన కృష్ణారెడ్డి పిలుపు మేరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యార్థులతో నింపి ఉద్యోగులు తమ విధులు నిర్వహించకుండా అడ్డుకునేవారు. దీంతో పోలీసులు విద్యార్థులను తమ వాహనాలలో ఎక్కించుకొని తాలూకా కేంద్రానికి దూరంగా విడిచి పెట్టేవారు. ఆ విద్యార్థుల వయసు 15, 20 సంవత్సరాల లోపు మాత్రమే. ఉద్యమకారులు యువతను తమతమ సైకిళ్ల పై నలుగురు, ఐదుగురు చిన్నారులను ఎక్కించుకొని తిరిగి తాలూకా కేంద్రానికి తీసుకువచ్చి లేదా వాళ్ళ ఇండ్లల్లో అప్పజెప్పేవారు. 1969 తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన  సీహెచ్ యల్లయ్య, గాజుల నారాయణ ఆనాటి అనుభవాలను నెమరువేసుకున్నారు.  

 నల్లగొండ, విజయక్రాంతి