బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం
- కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన గూడ్స్
- 9 మంది మృతి, ౪౧ మందికి గాయాలు
- మృతుల్లో ముగ్గురు రైల్వే ఉద్యోగులు
- డార్జిలింగ్ జిల్లా రంగాపానీ వద్ద ఘటన
- మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
- రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
- ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
కోల్‌కతా, జూన్ 17: పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ గూడ్సు రైలు వెనుకనుంచి బలంగా ఢీకొట్టంతో 9 మంది ప్రయాణీకులు మరణించారు. ౪౧ మందికి పైగా గాయపడ్డారు. న్యూ జల్పాయ్‌గురి సమీపంలోని రంగపాని రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. ప్రమాదం ధాటికి రైలు బోగీలు గాల్లోకి లేచి నిటారుగా నిలబడ్డాయి. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు త్రిపురలోని అగర్తల నుంచి కోల్‌కతాలోని సీల్దా వెళ్తుండగా, రంగపానీ స్టేషన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వస్తున్న గూడ్స్ రైలు ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. గూడ్స్‌రైలు సిబ్బంది సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లటమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.
తప్పిన భారీ ముప్పు
ప్రమాద స్థలంలో దృశ్యాలను చూస్తే అత్యంత భారీ రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది కనిపిస్తుంది. గూడ్స్ రైలు ఢీకొట్టిన వేగానికి ఎక్స్‌ప్రెస్ రైలులోకి మూడు బోగీలు గాల్లోకి తుక్కుతుక్కు అయ్యాయి. ఒక బోగీ లేచి నిటారుగా నిలబడింది. అయితే, రైలు చివరన ఉన్న ఈ బోగీల్లో ఒకటి పార్సిల్స్, మరొకటి గార్డులది కావటంతో మృతుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఒక ప్రయాణీకుల బోగీ మాత్రమే దెబ్బతిన్నది. దీంతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయవర్మ సిన్హా తెలిపారు.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, సహాయ చర్యలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుభాగం బాగానే ఉండటంతో దానిని గమ్యస్థానానికి పంపినట్టు తెలిపారు. క్షతగాత్రులను ఉత్తరబెంగాల్ మెడికల్ కాలేజీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి
ఈ రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రైల్వేశాఖ తరఫున రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2.5 లక్షల చొప్పు, స్వల్ప గాయాలైనవారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారం అందిస్తామని ప్రధాని తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అధికార యంత్రాంగాన్ని ఘటనా స్థలికి పంపి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. రైల్వేశాఖ మంత్రి సోమవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని సందర్శించారు. దవాఖానలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషన్ విచారణ చేపడుతుందని తెలిపారు.
రైల్వే మంత్రి రాజీనామా చేయాలి: ప్రతిపక్షాలు
రైలు ప్రమాదంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఒకవైపు ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలు పోతే.. రైల్వేశాఖ మంత్రి రీల్స్ చేయటంలో బిజీగా ఉన్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
కవచ్ లేకనే
దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించేందుకు రైల్వేశాఖ కవచ్ వ్యవస్థను వాడుతున్నది. రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినా, ఎదురెదురుగా వచ్చినా వెంటనే ఈ వ్యవస్థ క్రియాశీలంగా మారి హెచ్చరిస్తుంది. రైళ్ల బ్రేకులు ఆటోమెటిక్‌గా పడిపోతాయి. సోమవారం నాటి ప్రమాదం మార్గంలో కవచ్ వ్యవస్థను ఇంకా ఏర్పాటుచేయలేదు. గూడ్స్ రైలు సిబ్బంది సిగ్నల్‌ను గమనించకుండా రైలును అత్యంత వేగంతో ముందుకు పోనిచ్చారు.
అదే ట్రాక్‌పై ముందుగా కాంచన్‌జంగా రైలు వెళ్తున్న విషయాన్ని వారు గుర్తించలేదు. ఇలాంటి సమయంలోనే కవచ్ వ్యవస్థ ఉంటే క్రియాశీలమై రైలు దానంతట అదే ఆగిపోతుంది. భారతీయ రైల్వేల్లో ప్రమాదాలు నివారించటం కోసమే రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌ఎస్‌సీవో) ప్రత్యేకంగా కవచ్ రక్షణ వ్యవస్థను రూపొందించింది. 2022లో దీనిని ప్రవేశపెట్టారు.
ఈ దారి చాలా కీలకం
ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో కలుపలటంలో ఈ మార్గమే అత్యంత కీలకమైనది. సిల్చర్, అగర్తల వంటి ఈశాన్య రాష్ట్రాల నగరాలకు బెంగాల్ నుంచి ఈ రైలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాన్ని అధికారులు కోడి మెడ అని అభివర్ణిస్తుంటారు. కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా పర్యాటకులే ప్రయాణిస్తూ ఉంటారు. తాజా ప్రమాదంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.






