15 August, 2026 | 4:36 AM

తెలంగాణ జోలికి వస్తే ఖబర్దార్

18-06-2024 02:52 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 17 (విజయక్రాంతి) : తెలంగాణ అస్తిత్వం జోలికి వస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. ఏపీ ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలోకి విభజన చట్టానికి విరుద్ధంగా చొరబడాలని చూస్తుంటే.. తెలంగాణ సీఎస్ శాంతికుమారి తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలిగించే ఆ ఫైల్‌ను సీఎం వద్దకు మోసుకుపోవడం విచాకరకరమని అన్నారు. ‘సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు’ శీర్షికతో విజయక్రాంతిలో వచ్చిన కథనంతో ఏపీ ఉద్యోగుల ఫైల్‌కు బ్రేక్ పడిందని, తెలంగాణ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నష్టం జరిగే వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన విజయక్రాంతి పత్రిక యాజమాన్యాన్ని వారు అభినందించారు.

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవద్దని ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిం చారని, ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను తెలంగాణ సీఎస్ పాటిస్తున్నట్లుగా అనిపిస్తున్నదని వారు ఆరోపించారు. సీఎస్ శాంతి కుమారి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని లేని పక్షంలో తెలంగాణ ఉద్యోగుల, ప్రజా సంఘాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ విభాగాలలో అనేక మంది ఏపీ ఉద్యోగులు ఉన్నారని, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏ శాఖలో ఎంత మంది ఉన్నారో ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పాలన

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన వచ్చింది అనిపిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నీళ్లతో పాటు ఉద్యోగులు అన్యాయానికి గురయ్యారు. ముల్కీ రూల్స్, 610 జీవో నిబంధనలు నీరుగార్చారు. అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది. కానీ మళ్లీ చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ బాబు పెత్తనం పెరిగింది. అందులో భాగంగానే తెలంగాణ సచివాలయంలోకి ఏపీ ఉద్యోగులు చొరబడాలని చూశా రు. అందుకు తెలంగాణ సీఎం, సీఎస్ తలలు ఊపారు. కానీ దీని వలన తెలంగాణ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో పాలన చంద్రబాబు ఆదేశా లతో జరుగుతున్నదా అనిపిస్తున్నది.

చంద్రబాబు ఆదేశాలతోనే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలను కూల్చివేశారు. మళ్లీ ఓ ఐఏఎస్ అధికారిని బలి చేశారు. సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు అన్యాయం చేసే నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలి. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజం తిరగబడుతుంది. తెలంగాణ అస్థి త్వం జోలికి ఎవ్వడు వచ్చినా సహించేది లేదు. చంద్రబాబు కుట్రలను తెలంగాణ పౌర సమా జం గమనించాలి. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆదేశాలు పాటిస్తే ఆందోళనలు తప్పవు. |

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి 

తెలంగాణ ఉనికికే ప్రమాదం

ఏపీ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకోవాలనే నీచమైన నిర్ణయం అమలు జరిగితే తెలంగాణ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. చంద్రబాబు అధికా రంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణపై కుట్రలు చేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే సచివాలయంలో ఏపీ ఉద్యోగులను దొడ్డిదారిన నింపాలనుకున్నారు. తెలంగాణకు నష్టం చేసే ఇలాంటి కుట్రలకు సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి ఆఘమేఘాల మీద నిర్ణయాలు తీసుకోవాలనుకోవడం విచారకరం.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయం అంతాఇంతా కాదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర నిధులు, నీళ్లు, నియామకాల జోలికి వస్తే మరో ఉద్యమం తప్పదు. చంద్రబాబు తెలంగాణపై విషం కక్కుతాడు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆదేశాలు పాటిస్తే మళ్లీ తెలంగాణలో ఆందోళనలు జరుగుతాయి. ముఖ్యంగా ఏపీ ఉద్యోగులను తెలంగాణలోకి తీసుకునే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే తెలంగాణ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన చేస్తారు. 

 డా.చెరుకు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుడు