‘ప్రాంతీయ’ అస్తిత్వానికి ముప్పు!
తమిళనాడులో దశాబ్దాలుగా ద్రవిడ అస్తిత్వానికి చిరునామాగా, దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాభవానికి ప్రతీకగా నిలిచిన అన్నాడీఎంకే పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. తమిళనాట కొత్తగా కొలువైన టీవీకే సర్కార్ బలపరీక్ష సాక్షిగా అన్నాడీఎంకేలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ నేతలు సీవీ షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని అసంతృప్త వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి పార్టీ లో చీలికకు ఆజ్యం పోసింది.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం ఈ పరిణామంతో మరింతగా ముదిరిందనే చెప్పాలి. వాస్తవానికి డీఎంకేలో చీలిక కారణంగా 1972లో ఎంజీ రామచంద్రన్ నాయకత్వంలో పురుడుపోసుకున్న ఈ ద్రవిడ పార్టీకి ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదు. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి జానకి, జయలలిత మధ్య జరిగిన వర్గ పోరు నుంచి మొదలుకొని శశికళ, పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య మొన్నటివరకు చోటుచేసుకున్న ఆధిపత్య పోరు వరకు అన్నాడీఎంకే ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది.
అయితే, నేడు జరుగుతున్న వర్గపోరు గతానికి భిన్నమని చెప్పుకోవాలి. మహారాష్ట్రలో అధికారమే పరమావధిగా జరిగిన శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల చీలికల నేపథ్యంలో నుంచి ఈ పరిణామాన్ని చూడాల్సిన అవసరం ఉంది. గత కొంతకాలంగా ప్రాంతీయ పార్టీల రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. వారసత్వ రాజకీయాలు, నాయకత్వ పోరు, నాయకత్వంపై అసంతృప్తులు దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల్లో చీలికలకు దారితీస్తున్నాయి. అయితే, అధికారం కోసం పొత్తులు, ఈడీ వంటి సంస్థల దర్యాప్తుతో ఒత్తిళ్లు, రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితితో జాతీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నప్పటికీ, చీలికలకు ఇవే ప్రధాన కారణాలని చెప్పలేం.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ జనాదరణ కలిగిన ఒకే నాయకుడిపై ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. క్యాడర్, లీడర్లను ఏకతాటిపైకి నడిపించే అలాంటి నాయకుడు మరణించిన సందర్భాల్లో ఏర్పడుతున్న నాయకత్వ శూన్యత ప్రాంతీయ పార్టీలకు పెనుసవాలు గా మారుతోంది. అలాంటి సందర్భాల్లో ఇటు వారసులు, అటు సీనియర్ నాయకుల మధ్య నాయకత్వం కోసం ఆధిపత్య పోరు, ఎన్నికల్లో ఓటమిపాలైనప్పుడు అధికారమే లక్ష్యంగా మరో పవర్ సెంటర్ ఏర్పడటం ప్రాంతీయ పార్టీల్లో చీలికలకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఇది మహారాష్ట్ర, తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలకే పరిమితమయ్యే సమస్య కాదు. ఈ పరిణా మాల నుంచి ఇతర ప్రాంతీయ పార్టీలు పాఠాలు నేర్చుకొని తమ అస్తిత్వంతోపాటు ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడుకుంటాయో, లేదో చూడాలి.






