27 May, 2026 | 2:04 AM

రెండు నెలలుగా సేవలందించని ఆధార్ కేంద్రం

27-05-2026 12:18 AM
  1. ఆధార్ సేవలకు తప్పని తిప్పలు 
  2. పట్టణం ఆధార్ కేంద్రాల బాటకు ప్రజలు 

పాల్వంచ, మే26,( విజయక్రాంతి): ఒకవైపు వ్యవసాయ సీజన్ ముంచుకొస్తోంది, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం ఆసన్నమౌతోంది ఈ తరుణంలో ఆధార్ కేంద్రాల సేవలు కీలకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోనీ బసవ తారక కాలనీ లో గల ఆధార్ కేంద్రం గత రెండు నెలలుగా మూతపడి సేవలకు దూరంగా ఉంది. దీంతో మండల ప్రజలు ఆధార్ సేవలకై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పాల్వంచ మండలంలో కేవలం మూడు ఆధార్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి.

వాటిలో బసవతారక కాలనీకి చెందిన ఆధార్ కేంద్రము మూతపడటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డుకు సంబంధించిన పేరు మార్పు చిరునామా సవరణ బయోమెట్రిక్ అప్డేట్ మొబైల్ నెంబర్ నమోదు వంటి వాటికి ఆధార్ కేంద్రాల సేవలు తప్పనిసరి.

ఈ తరుణంలో బసవతారం కాలనీ ఆధార కేంద్రం మూతపడటంతో తప్పనిసరిగా ప్రజలు తమ అవసరాల కోసం పట్టణ పరిధిలోని ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో గల రెండు ఆధార్ కేంద్రాల్లో ఇసుక వేస్తే రాలనీ రీతిలో జనం గుమిగోడుతున్నారు. వారికి తోడు గ్రామీణ ప్రాంతం ప్రజలు సైతం ఆ కేంద్రాలకే చేరడంతో సమయం, ఖర్చు వృధా అవుతోందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గ్రామీణ ఆధార్ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.