23 July, 2026 | 5:59 AM

కేజ్రీ బ్రాండ్‌కు బీటలు

06-06-2024 12:54 AM

ఏమాత్రం ప్రభావం చూపని ఆప్

రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చింది 3 సీట్లే

ఢిల్లీలో ఖాతా తెరలేకపోయిన చీపురు పార్టీ

పంజాబ్‌లో మూడు సీట్లతోనే సరి

లిక్కర్ స్కాంపై రెఫరెండంగా ఆప్ ప్రచారం

పూర్తిగా తిరస్కరించిన ఓటర్లు

న్యూఢిల్లీ, జూన్ 5: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దేశం దృష్టిని అతిగా ఆకర్షించింది బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) వైరమే. సరిగ్గా ఎన్నికల ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ కుంభకోణం కేసులో జైలుకు పంపటంతో బీజేపీ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నదని ఆప్ విమర్శలకు దిగింది. జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఆప్ ఏనాటికైనా బీజేపీకి ప్రమాదరకంగా మారుతుందని భయపడి ఆదిలోనే ఆప్‌ను అంతం చేసేందుకు మోదీ సర్కారు కుట్ర చేస్తున్నదని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా విమర్శించారు. కేజ్రీవాల్ నిజాయతీ, నిబద్ధతకు లోక్‌సభ ఎన్నికలు రెఫరెండమని ఆప్ నేతలు జోరుగా ప్రచారం చేశారు. ఢిల్లీ పంజాబ్ ఓటరు కేజ్రీ బ్రాండ్ ను తిరస్కరించారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొన్నది. ఆప్‌కు ఒక్కటి కూడా దక్కలేదు. దీంతో ఆప్ ప్రచార లెక్క ప్రకారమైతే ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ బ్రాండ్‌ను తిరస్కరించిన ట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పంజాబ్‌లో ఎదురుగాలి

పంజాబ్‌లో కూడా ఆప్ ప్రభుత్వమే ఉన్నది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పంజాబ్‌లో 13 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఇందులో ఆప్ మూడు చోట్ల మాత్రమే గెలవగలిగింది. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆప్.. కాంగ్రెస్ పార్టీతో కలిసే పంజాబ్, ఢిల్లీలో బరిలోకి దిగింది. 13 స్థానాల్లో కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. ఆప్ మాత్రం మూడు ఎంపీ సీట్లతోనే సరిపెట్టుకొన్నది. దీంతో పంజాబ్ ప్రజ లు కూడా ఆప్‌ను తిరస్కరించారని విశ్లేషి స్తున్నారు. నిజానికి ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ అంటూ మొదలుపెట్టిన ప్రచారంతో తమకు గొప్పగా కలిసి వస్తుందని ఆప్ నేతలు నమ్మకం పెట్టుకొన్నారు. కానీ, ఆ ప్రచారం ప్రభావం చూపలేదు. గుజాత్, హర్యానా, అస్సాంలో ఆప్ ఖాతా తెరవలేదు.