23 July, 2026 | 7:04 AM

మోదీ ప్రమాణం 9న

06-06-2024 12:53 AM

ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్

మూడోసారి ప్రమాణం చేయనున్న మోదీ 

ప్రధాని పదవికి రాజీనామా

మోదీని ఎన్నుకున్న ఎన్డీయే కూటమి నేతలు

ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిస్తూ బాబు, నితీశ్ లేఖలు

రేపు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీయే కూటమి నేతలు 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సింగా కోరనున్న ఎన్డీయే

న్యూఢిల్లీ, జూన్ 5: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆదివారం (ఈ నెల 9వ తేదీన)ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రమాణం చేసేందుకు ముహూ ర్తం ఫిక్స్ చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్కు సీట్లు రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు.

బుధవారం చివరిసారిగా కేంద్ర క్యాబినెట్ మోదీ నివాసంలో భేటీ అయ్యింది. లోక్‌సభ రద్దు చేసేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అనంతరం మంత్రివర్గ సహచరులతో కలసి నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. లోక్‌సభ రద్దు నిర్ణయంతో పాటు తన రాజీనామా పత్రాన్ని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. మోదీ ప్రమాణస్వీకారానికి ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి మూడు లోక్‌సభ ఎన్నికల తర్వాత భారత ప్రథమ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. 1952 నుంచి 1964 వరకు ప్రధానిగా సేవలందించారు. మళ్లీ ఇంతకాలానికి నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. 

మోదీ ఏకగ్రీవం..

మూడోసారి ప్రధానమంత్రిగా నరేం ద్ర మోదీని ఎన్డీయే కూటమి నేతలు ఎన్నుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఎన్డీయే కూటమి నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి నేతగా నరేంద్ర మోదీని నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సుమారు గంటన్నర సేపు నరేంద్ర మోదీ నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకున్నారు.

క్యాబినెట్ కూర్పు, ఏయే పార్టీలకు ఏ శాఖలు కేటాయించాలన్న దానిపైనా చర్చ సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా ప్రభుత్వం చేసే స్థాయిలో సీట్లు రాలేదు. బీజేపీ సొంతంగా 240 సీట్లు గెలుచుకుని లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ప్ర భుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మార్కు 272 సీట్లు మాత్రం అందుకోలేకపోయింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 సీట్లు వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

చంద్రబాబు మద్దతు

ఏపీలో ఏకంగా 16 సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్‌గా టీడీపీ అధి నేత చంద్రబాబు నాయుడు నిలిచారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చంద్రబాబు లేఖ ఇచ్చా రు. ఆయనతో పాటు బీహార్ సీఎం నితీశ్ కూడా ఎన్డీయేకు మద్దతు పలుకుతూ లేఖ అందజేశారు.

కాగా, కేంద్రంలో ప్రభుత్వం స్థిరంగా ఐదేళ్ల పాటు నడవాలంటే చంద్రబాబు, నితీశ్‌పాత్ర చాలా కీలకం కానుంది. ఎన్డీయే కూటమి మద్దతు ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రేపే మాపో రాష్ట్రపతి ముర్మును కలసి విజ్ఞప్తి చేయనున్నారు. మరోసారి ఎన్డీయే కూటమి నేతలతో చర్చించి ప్రమాణస్వీకారంపై నిర్ణయం తీసుకోనున్నారు.